ఓటు వేయకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారు

0
202

ఓటు వేయకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారు

  • ప్రజలను అవమానిస్తున్న రాజగోపాల్ రెడ్డి ఖబడ్దార్
  • డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
    రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ

మునుగోడు, అక్టోబర్ 20 (నవతరం): మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీకి ఓటేయకపోతే పథకాలు రావంటూ, ఫించన్లు రావంటూ టిఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ప్రచారానికి వెళ్లిన నాయకులు ప్రజలతో మీ ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయని, టిఆర్ఎస్ కు ఓటేయకపోతే వెంటనే తెలిసిపోతుందని, వేయకపోతే ఫించన్లు రావని, ఏ పథకాలకు అర్హులు కారని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే నియోజకవర్గంలో హరీష్ రావు, కెటిఆర్ వందల కోట్లు తీసుకొచ్చి పంచడానికి సిద్ధంగా ఉన్నారని, అయినా సరే గెలవమని తెలియడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ వచ్చి కూర్చొని మాట్లాడినా సరే ప్రజలు వారికి ఓటేయరని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మర్రిగూడ మండలంలోని ఒక ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు.
మరోపక్క ప్రచారంలో భాగంగా బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రైవేట్ సైన్యం, గుండాలతో దాడి చేస్తామని బెదిరిస్తున్నారని, ప్రజలను బెదిరిస్తే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మునుగోడులో మీ పార్టీలకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. అధికార, ధన, మంద బలంతో ప్రజలను చిన్నచూపు చూస్తే ఊరుకోమన్నారు. దొరల పోకడలను ఓడిస్తామన్నారు. 70 ఏళ్లుగా పేదల బతుకులు మార్చకపోగా, వారిని అవమానిస్తున్న దోపిడి దొంగల పార్టీలను గద్దె దించాలని నినదించారు. బహుజన్ సమాజ్ పార్టీని ఎదుర్కోలేకనే ఇది ఎస్సీల పార్టీ అని ముద్ర వేస్తున్నారని తెలిపారు. ఎస్సిల పార్టీ అయితే మునుగోడులో బిసి అభ్యర్థికి టికెట్ ఎలా ఇచ్చాం? రాబోయే ఎన్నికల్లో కూడా బిసిలకు 60 నుండి 70 సీట్లు ఇస్తామని ప్రకటించిన పార్టీని ఎస్సీల పార్టీ అని కావాలని కుట్రపూరితంగా ఆధిపత్య వర్గాలు ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మునుగోడులో ఎంత డబ్బు,మద్యం,బిర్యాని పంచి ప్రలోభపెట్టినా బహుజనులంతా ఒక్కటై ఏనుగు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్, రేవంత్ రెడ్డి, సంజయ్, ఇతర కమేడియన్లు ఎంత మంది వచ్చినా ఏనుగు గుర్తునే గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విజయ్ ఆర్య,జిల్లా నాయకులు పల్లేటి రవీందర్, లింగం, సిద్దార్థఫూలే తదితరులు పాల్గొన్నారు.