హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి దాటాక కలకలం. ఆ అపార్ట్‌మెంట్‌లో అంతా ఎవరిళ్లలో వారు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఓ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అంతా ఉలిక్కిపడి వచ్చి చూసేసరికి ఓ మహిళ మంటల్లో కాలిపోతూ కనిపించింది. పక్కన బెడ్‌రూంలో నిద్రపోతున్న ఏడాదిన్నర పసివాడికి ముందుగదిలో ఏం జరుగుతోందో తెలీదు అమ్మ మంటల్లో కాలిపోతోందని. చుట్టుపక్కలవారు ఆ పిల్లాడ్ని మాత్రం కాపాడగలిగినా ఆ మహిళ మాత్రం కాల్చిన కట్టెలా మారిపోయింది.
ఎర్రగడ్డలోని శంకర్‌లాల్‌నగర్‌లో జరిగిన ఈ దారుణ సంఘటనలో మరణించిన మహిళ పేరు సౌమ్య. వివాహిత. కుటుంబ కలహాలతోనో, మరో కారణంతోనో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మొదట అనుకున్నారు. కానీ పోలీసు ఎంక్వయిరీ మొదలయ్యాకే తెలిసింది అది ప్రీప్లాన్డ్ మర్డర్ అని. వైజాగ్‌కు చెందిన సౌమ్య, నాగభూషణంలకు నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. ఎల్ అండ్ టీలో పనిచేసే నాగభూషణానికి బెంగళూరునుంచి హైదరాబాద్‌కి ఈమధ్యే ట్రాన్స్‌ఫర్ అయ్యింది.
మంటల్లో సౌమ్య కాలిపోతున్న సమయంలో ఇంటి తలుపు బయటినుంచి వేసి ఉంది. రంగంలోకి దిగిన క్లూస్‌టీం దొరికిన ఆధారాలతో అది హత్యేనని నిర్ధారించుకుంది. సంఘటన జరిగిన సమయంలో భర్త నాగభూషణం ఇంట్లో లేడు. నైట్ డ్యూటీకి వెళ్లినట్లు చెబుతున్నారు.
అంత రాత్రివేళ సౌమ్య తలుపులు ఎందుకు తెరిచింది? వచ్చిందెవరు? భర్త పనేనా..లేకుంటే వేరెవరన్నా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? పోలీస్ ఎంక్వయిరీలోనే ఇవన్నీ తేలాల్సి ఉంది. చంపిన తర్వాత మృతదేహాన్ని తగలబెట్టారా? లేదంటే వెంటనే మంటలంటుకునే రసాయనాల్ని చల్లి నిప్పంటించారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మెడమీద కత్తిగాట్లు కూడా ఉన్నాయని పోలీసులు అంటున్నారు.

