అమ్మవారి నగలు చోరీ

0
539

ఆలయం పేరిట పది ఎకరాల భూమి కొన్నట్లు విరాళాల సేకరణ, స్వాహా

వెల వెల బోయిన అమ్మవారి ముఖం, విలవిలలాడిన భక్త సమాజం.

మాయ మాటలతో అమ్మవారి బంగారం చోరీ

పాత ట్రస్టు సభ్యుడే ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు సమాచారం

తెల్లబోయిన అమ్మవారి ముఖాన్ని చూసి విలవిలలాడిన ప్రజానీకం

అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

అశ్వరావుపేట (నవతరం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, వేదంతపురం గ్రామపంచాయతీ పరిధిలో శ్రీ వనదుర్గంబిక దేవి ఆలయం ఎన్నో అలంకరణలతో భక్తులను అలరాలిస్తూ సుఖ శాంతులతో దీవిస్తుండడం అందరికీ తెలిసిన విషయమే. ఆలయ దేవాదాయం పేరు మీద 10 ఎకరాల భూమి కొన్నట్లు దాతల నుండి విరాళాలు సేకరించి, వాటి లెక్కలు చెప్పకుండా దాసరి శ్రీనివాస్ రావు స్వాహా చేసినట్లు ఆలయ కమిటీ సలహాదారు, అధ్యక్ష, సర్పంచ్ లు తెలియజేశారు. ఇది భారీ కుంభకోణంగా భావించి, కమిటీ, గ్రామస్తులు జీవించుకోలేకపోతున్నట్లు సమాచారం. అలాగే ఆలయ అభివృద్ధికి అవసరమైన  మరి కొన్ని విషయాల్లో అతని ఆగడాలు మితిమీరడంతో కమిటీ సభ్యులు వేదాంతపురం సర్పంచ్ సోమిని శివశంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో పాత కమిటీ రద్దుచేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనివాసరావుని కమిటీ సభ్యుడిగా కొనసాగాలని కూడా చెప్పడంతో, అంగీకరించినట్లే అంగీకరించి, అతనికి సంబంధించిన కొన్ని వస్తువులను గుడి ప్రాంగణం నుండి తీసుకెళ్తానని చెప్పడంతో, కొత్త కమిటీ సభ్యులు, అధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వరరావు అతనికి సంబంధించిన వస్తువులు అందరి సమక్షంలో తీసుకెళ్లాల్సిందిగా చెప్పినట్లు తెలిపారు. కానీ దాసరి శ్రీనివాసరావు ఎవరికీ చెప్పకుండా ఆలయ ప్రాంగణంలో ఉన్న వారి వద్ద నుండి మాయమాటలతో తాళాలు లాగేసుకొని ట్రస్టు వారి పరోక్షంలో దౌర్జన్యంగా ఆలయంలోకి ప్రవేశించి విజయవాడ శివ స్వామీజీ బహుకరించిన అమ్మవారి శిరస్సును చేదించి, అమ్మవారి నాగసర్పం, స్వామివారి నాగసర్పం, అమ్మవారి మకర తోరణం, వెండి గ్లాసులు, వెండి పళ్లెం, అమ్మవారి బంగారు సూత్రాలు, అమ్మవారి చీరలు, అలంకరణకు ఏర్పరిచిన డిజైన్ క్లాత్ లు, రెండు త్రిశూలాలు కలిపి సుమారు ఐదు లక్షల రూపాయల విలువగల పనిముట్లను దౌర్జన్యంగా 11 – 10 – 2022న ఉదయం 9.30 గంటల సమయంలో తీసుకెళ్లి పోవడం జరిగిందని ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. తదుపరి ట్రస్టు సభ్యులు అతనికి ఫోన్ చేసి అడగగా అవన్నీ నా వస్తువులే అంటూ బకాయించడం మొదలెట్టాడని, అవి వాస్తవంగా దాతలు బహుకరించిన ఆభరణాలేనని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. అసలు అమ్మవారి శిరస్సును చేదించటం వారి గ్రామానికి అరిష్టంగా భావించి గ్రామస్తులంతా భయభ్రాంతులకు గురవుతున్నట్లు ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు తెలియజేస్తున్నారు. హిందూ ధర్మంలో ఎక్కడా లేనివిధంగా అమ్మవారి శిరస్సును తీసుకెళ్లిపోవడం అవమానంగా భావిస్తూ గ్రామ శ్రేయస్సు నిమిత్తం సర్పంచ్ సోమిని శివశంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సంగీత వీర్రాజు, ప్రధాన కార్యదర్శి పాలవలస వినాయకరావు లు దాసరి శ్రీనివాసరావు పై అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి దరఖాస్తు సమర్పించినట్లు తెలియజేశారు. అలాగే వీరంతా నిందితుడిని శిక్షించి, చోరీకి గురైన ఆభరణాలను తిరిగి అమ్మవారికి అలంకరించేందుకై జప్తు చేసుకోవాల్సిందిగా ప్రాధేయ పడుతున్నారు. ఇక ఈ విషయంలో నిజా నిజాలు పోలీసులే తేల్చాల్సి, వేచి చూడాల్సి వుంది.