తను పట్టిన కుందేలుకి మూడేకాళ్లంటాడు. తను మెచ్చిందే రంభంటాడు. ఎవడైతే నాకేంటంటాడు. హాలీవుడ్‌లో పుట్టుంటే స్పిల్‌బర్గ్‌ని మించి పోయేవాడినన్నంత బిల్డప్పిస్తాడు. ప్రతీదీ నాకేనంటాడు. వర్మా ఏమిటీ ఖర్మనేలా చేస్తుంటాడు.
బోల్డ్‌గా మాట్లాడే వర్మ ఈమధ్య బట్టలిప్పేశాడు. వెండితెరమీద వర్కవుట్ కాదనుకున్నాడో ఏమో…వెబ్‌లోకి జొరబడి పోర్న్ స్టార్‌తో సందేశాత్మక సిన్మా అంటూ వికటించే ప్రయోగం చేశాడు. పచ్చిగా జీఎస్టీ(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) తీసేసి తనేం చేసినా చెల్లుతుందని కాలర్ ఎగరేశాడు. మన సిన్మాలు కూడా కొన్ని శృతిమించుతున్నాయేమోగానీ మరీ వర్మలా బట్టలిప్పేయలేదు. అందుకే మహిళాసంఘాల ఫైరింగ్. దురుద్దేశమేమీ లేదని, అపార్ధంచేసుకోవద్దని చెప్పుంటే ఎలా ఉండేదోగానీ…అంత స్మూత్‌గా చెబితే వర్మ ఎందుకవుతాడు. నోటికొచ్చినట్టు వాగేశాడు. చివరికి కేసుల్లో చిక్కుకున్నాడు.

హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన రెండు కేసులకు వివరణ ఇచ్చేందుకు వచ్చిన రాంగోపాల్‌వర్మని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు పోలీసులు. తనలాంటి పాపులర్ డైరెక్టర్‌ని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి పంపిస్తారనుకున్న వర్మ అంచనా దెబ్బతింది. కథా స్క్రీన్‌ప్లే దర్శకత్వం అన్నీ తానేనని చెప్పుకునే వర్మ జీఎస్టీ విషయంలో పోలీసులు చేసిన ఇంటరాగేషన్‌తో నెల్లూరు పెద్దారెడ్డిలా డిఫెన్స్‌లో పడ్డాడు. అసలా సిన్మా తనదికానే కాదని బుకాయించాడు.
జీఎస్టీ సినిమా షూటింగ్‌లో తాను పాల్గొనలేదని అంటున్నాడు వర్మ. మరి బట్టలిప్పేసిన పోర్న్‌స్టార్ ముందు నిలబడి సీన్ వివరిస్తోంది వర్మ డూపేమో! కేవలం కాన్సెప్ట్ మాత్రమే తనదన్నది వర్మ చెప్పే వివరణ. అమెరికన్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా తీసిందని, తాను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు వర్మ. అలాగా అని అమాయకంగా పోలీసులు ఎందుకు వదులుతారు. మూడున్నర గంటలు వర్మని నిలబెట్టి అడిగేశారు. ప్రశ్నలతో కడిగేశారు. ఆయన ల్యాప్‌టాప్ సీజ్ చేశారు. తదుపరి విచారణకు శుక్రవారం రావాలని నోటీసు జారీచేశారు.

జీఎస్టీని పోలాండ్, యూకేలో జీఎస్టీ చిత్రీకరించారని పోలీసులకు చెప్పాడు రాంగోపాల్‌వర్మ. ఆయా దేశాలకు వర్మ వెళ్లడంపైనా విచారణ చేస్తున్నట్టు అడిషనల్ డీసీపీ తెలిపారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వర్మ సమయం కోరాడన్నారు. రాంగోపాల్ వర్మ తీసిన ఈ చిత్రంపై ఓ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చలో తనను దూషించారంటూ సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

