దేశంలో అందరినీ ఓ చూపు చూసేశామనుకున్నారో…జర్నలిస్టులకేమన్నా కొమ్ములున్నాయా అనుకున్నారో..తాము కెలకడం మొదలుపెడితే వెనకాముందు ఎవరున్నారో చూసుకోమని చెప్పదలుచుకున్నారో…దేశం వెలిగిపోతోందన్న తమ అభిప్రాయాన్నే పత్రికలు, మీడియామీదా రుద్దాలనుకున్నారోగానీ….ఈ దేశంలో జర్నలిస్టుల్ని కూడా అక్రిడేషన్ల పేరు చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కారు. పెద్ద నోట్ల రద్దే కాదు..చిన్నాచితకా పద్దుల్నీ వదిలిపెట్టేది లేదన్నట్లు జర్నలిస్ట్‌లకు ఇచ్చే అక్రిడేషన్ మార్గదర్శకాల్లోనూ కీలక మార్పులకు సిద్ధపడింది కేంద్ర సమాచార శాఖ.
జర్నలిస్టులు రాసేవార్తలో ఒరిజనల్లో, డూప్లికేటో ఇకమీదట శల్యపరీక్ష చేస్తారట. ఒకవేళ వార్తలు నకిలీవని తేలితే అవి రాసిన జర్నలిస్టుల అక్రిడేషన్లని రద్దు చేయాలనేది కేంద్ర పెద్దలకు వచ్చిన కొత్త ఆలోచన. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఫేక్ న్యూస్ పెరిగిపోతుండటంతో వాటిని కట్టడి చేసేందుకే ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచార శాఖ చల్లగా చెప్పేసింది.
ఏదైనా వార్త అవాస్తవమని ఫిర్యాదు వస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ 15 రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. విచారణ సమయంలో సదరు జర్నలిస్ట్ అక్రిడేషన్ సస్పెన్షన్‌లో ఉంటుంది. ఒకవేళ అది ఫేక్ న్యూసని తేలితే గనుక మొదటి తప్పిదానికి ఆరు నెలలు, రెండోసారి కూడా ఉల్లంఘిస్తే ఏడాది, మూడోసారీ అదే రిపీట్ అయితే పర్మినెంట్‌గా అక్రిడేషన్ రద్దు చేస్తామని కేంద్ర సమాచార శాఖ చెప్పుకొచ్చింది.
తమ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేసిన మర్నాడే జర్నలిస్ట్‌ల అక్రిడేషన్‌పై కొత్త నియమనిబంధనలని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఫేక్ న్యూస్‌ల విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకే వదిలేయాలని మోడీ స్పష్టంచేశారు. పాత్రికేయ సమాజం నుంచి నిరసనలు తప్పవన్న ఆలోచనతోనే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది మోడీ సర్కారు.

