
నవతరం, హైదరాబాద్:
అదిగో… అదిగో…
ఆకాశపు అంచుల నుంచి
భూమి ఒడిలోకి దిగివస్తోంది
శుభాలనొసగే సంక్రాంతి లక్ష్మీ…
సుఖసంతోషాల పల్లకీలో
ఊరేగుతూ ఇంటింటా చిరునవ్వుల
సంబరాల్ని వెన్నెలవెలుగుల్ని పంచే
సౌభాగ్య లక్ష్మి ఈ సంక్రాంతి లక్ష్మి…
మెండుగా ఎద నిండగా
అన్నపూర్ణ ఆశీస్సుల వర్షంతో
పచ్చని పంట పొలాలు ఆలపించే
కృతజ్ఞతా గీతం ఈ సంక్రాంతి పర్వదినం…
ఇది గంగిరెద్దుల గర్వపు నడక…
ఇది పతంగుల స్వేచ్ఛా విహారం…
ఇది హరిదాసుల హరినామ స్మరణ…
ఇది పిండివంటల తిండి పండుగ…
ఇది ఆడపడుచుల ఆశల పండుగ…
ఇది భోగి మంటల వెలుతురు గీతం
ఇది ముత్యాల ముగ్గుల మౌనకావ్యం…
ఇది…దూరమైన బంధువుల ఆత్మీయ
ఆలింగనాల అనుబంధాల పండుగ…
ఇది ఆశబోతు అల్లుళ్లకు అతిథి
సత్కారాలు చేసే ఆత్మీయుల పండుగ…
సకల భోగాలను సుఖశాంతుల వరాలనిచ్చే ఆదిత్యునికి భక్తితో చేసే
ఆరాధనే ఈ సంక్రాంతి పండుగ…
పితృదేవతలకు స్మరణగా
కృతజ్ఞతగా సంతర్పణ చేసే
పెద్దల పండుగే ఈ సంక్రాంతి పండుగ…
అదిగో అదిగో వస్తోంది
సంతోషాల సంక్రాంతి లక్ష్మి
పలుకుదాం స్వాగతం సుస్వాగతం…
రచన:
కవిరత్న
సాహిత్య ధీర
సహస్ర కవి భూషణ్
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్

