ఆంధ్రా ఎంపీలు రెండువారాలుగా హస్తినలో నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఉభయసభల సాక్షిగా గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఎందుకింత రాద్ధాంతం జరుగుతోందో, తమవైపునుంచి జరిగిన తప్పిదాలను ఎలా సరిదిద్దుకోవాలో, వివాదం శృతిమించకుండా ఎలా నచ్చజెప్పాలో కనీస ప్రయత్నం చేయలేదు బీజేపీ నాయకత్వం. అడ్డగోలు విభజనతోనే ఈ ఇబ్బందని తప్పునంతా ఒక్క మాటలో మోడీ కాంగ్రెస్‌మీదికి నెట్టేస్తే..అవకాశముంటే డిఫెన్స్ బడ్జెట్ కూడా అడిగేస్తారంటూ నోరుపారేసుకున్నాడు కాకిలెక్కల అరుణ్‌జైట్లీ.

పార్లమెంట్ ఉభయసభల్లో ఏపీ నిరసనలు చివరికి జాతీయ అంశంగా మారిపోయాయి. కేంద్రమంత్రులతో రాజీనామా చేయించడమే కాదు, ఎన్డీఏకి గుడ్‌బై చెబుతూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది టీడీపీ. ఎప్పుడైతే ఏపీలో బీజేపీకి దశాబ్ధాలుగా నమ్మకస్తుడైన మిత్రుడిగా ఉన్న పార్టీ దూరమయ్యిందో క్షణాల్లో ప్రతిస్పందించింది బీజేపీ. తక్షణమే స్పందించి ఏపీకి వరాలు కురిపించలేదు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై స్పందించలేదు. ఏపీలో పార్టీ భవిష్యత్తుపై ఆగమేఘాలమీద స్పందించి పార్టీ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశాడు మాయలమరాఠీ అమిత్‌షా.
ఓ పక్క అవిశ్వాసానికి టీడీపీ అన్నిపార్టీల మద్దతు కూడగట్టుకుంటుంటే…ఏపీలో భవిష్యత్తులో బీజేపీ రాజకీయం ఎలా ఉండాలో సీరియస్‌గా చర్చించాడు అమిత్‌షా. ఆ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో వ్యూహరచనతో కాషాయజెండాని రెపరెపలాడించిన రాంమాధవ్‌కి ఏపీ బీజేపీ ఇంచార్జిగా కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇక టీడీపీపై దూకుడుగా వెళ్లాలని మీటింగ్‌లో నిర్ణయించారు.
మీటింగ్‌నుంచి బయటికి రాగానే పాచిపోయిన పాతపాటనే ఎత్తుకున్నారు ఏపీ బీజేపీ నేతలు. ఎంతో చేశామనీ, చెప్పనివి కూడా ఇచ్చామనీ, ఏవో చిన్నాచితకా కొన్ని మిగిలిపోయాయనీ జనం చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టారు. ఇప్పటిదాకా చంద్రబాబు ప్రశ్నించారనీ…ఇకనుంచి తమ ప్రశ్నలకు టీడీపీ అధినేత సమాధానం చెప్పాల్సి ఉంటుందనీ భారీ డైలాగొదిలాడు రాంమాధవ్. మొహాలెక్కడ పెట్టుకోవాలో, ఏపీ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలో చూసుకోకుండా ప్రశ్నిస్తారట. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్లే ఉంది బీజేపీ నేతల వరస చూస్తుంటే.

