చంద్రబాబు దాగుడుమూతలు ఆడినన్నాళ్లూ ఆడారు. బీజేపీని బతిమాలారు. దేబరించారు. ఆయన లెక్కప్రకారమే 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారు. కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వనని చెప్పగానే…ఎన్డీఏమీద ఈగవాలకుండా తానే దాన్ని ముగిసిన అధ్యాయంగా తీసిపారేశారు. తమ్ముళ్లు ఆవేశం పట్టలేక కాస్త నోరుపారేసుకున్నా బీజేపీతో బంధం తెగిపోకుండా చూసుకునేందుకు చివరిదాకా జాగ్రత్తపడ్డారు. మెత్తగుంటే మొత్తబుద్ధవుతుందన్నట్లు కేంద్రం ఏపీని కరివేపాకులా తీసిపారేసింది. పైసా విదల్చకపోయినా చంద్రబాబు నోరెత్తలేడన్నట్లు నిర్లక్ష్యంచేసింది. దీంతో చంద్రబాబు ఇద్దరు మంత్రుల్ని కేంద్ర కేబినెట్‌నుంచి ఉపసంహరించుకున్నారు. ఎన్డీఏలో కొనసాగుదాన్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని అవిశ్వాసం దాకా వెళ్లారు. ఏదయితే అదవుతుందని చూసుకుందాం రమ్మంటూ తొడగొట్టారు.
ఎన్డీఏతో టీడీపీ అనుబంధం ఇప్పటిదికాదు. వాజ్‌పేయి హయాంలోనే కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు చంద్రబాబు. దశాబ్ధాల అనుబంధాన్ని టీడీపీ ఇక వద్దనుకోవడం సహజంగానే జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. మోడీమీద, బీజేపీ మీద అసహనంగా ఉన్న పార్టీలకు ఎడారిలో నీటిచలమలా చంద్రబాబు దొరికారు. బీజేపీతో సర్దుకుపోలేక, అలాగని కాంగ్రెస్‌తో కలవలేక తర్జనభర్జనపడుతున్న పార్టీలకు జాతీయస్థాయి ప్రత్యామ్నాయ వేదికకు చంద్రబాబు అనుకోకుండా దారిచూపించారు. థర్డ్‌ఫ్రంట్ తెరపైకొస్తుందో లేదోగానీ…ఏపీ విభజన సమస్యలతో జాతీయస్థాయిలో చంద్రబాబుకు చాణక్యనీతిని ప్రదర్శించేందుకు ఓ అవకాశమైతే దొరికింది.
ఇదే సమయంలో మరో తెలుగురాష్ట్రమైన తెలంగాణ సీఎం జాతీయస్థాయి ఫ్రంట్‌కు నడుంబిగించడం అనూహ్యపరిణామం. జాతీయస్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని, కేంద్రం అన్ని హక్కుల్నీ తన చేతుల్లో పెట్టుకోవడం మంచిది కాదన్న కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్సేతర పక్షాల్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యమంటున్నారు. ఎప్పుడైతే అవిశ్వాసంతో జాతీయస్థాయిలో టీడీపీ ఫోకస్ అయ్యిందో..తన ఫ్రంట్ ఆలోచనను కార్యరూపంలో పెట్టేందుకు ఏకంగా కోల్‌కతాలో వాలిపోయారు టీఆర్ఎస్ అధినేత.
పశ్చిమబంగ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్ జరిపిన సమాలోచనలు జాతీయ రాజకీయాల్లో బ్రేకింగ్ అయ్యాయి. అంతంకాదిది ఆరంభమంటున్నారు కేసీఆర్. మంచి ప్రయత్నమంటూ కితాబిచ్చారు మమతాదీదీ. అంతా బాగానే ఉన్నా..పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీల వ్యూహానికి, అధినేత ఫ్రంట్ ప్రయత్నాలకు ఎక్కడా సింక్ కావడంలేదు. సోదరరాష్ట్ర అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాల్సిన టీఆర్ఎస్ దానిపై నోరెత్తడంలేదు. పైగా సభ ఆర్డర్‌లో లేదంటూ లోక్‌సభ స్పీకర్ వాయిదాలేస్తూ పోతున్నా ఏఐడీఎంకేతో పాటు పోడియం దగ్గర సంబంధంలేని సమస్యపై గులాబీపార్టీ నిరసనకు దిగుతోంది.
ఏఐడీఎంకే బీజేపీ ఎజెండాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అపప్రద ఉంది. టీఆర్ఎస్ కూడా మరో కారణంతో దాంతో జతకలవడమే అనుమానాలకు తావిస్తోంది. మోడీ సర్కారుని ఇరకాటంలో పడేసే అవకాశాన్ని వాడుకుని ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనకు బలం చేకూర్చాల్సిన పార్టీ ద్వంద్వ వైఖరి అనుమానించేలా ఉంది. ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకోసం బీజేపీ ఎంతకయినా తెగించేలా కనిపిస్తోంది. కొన్ని పార్టీల్నితన భవిష్యత్తు రాజకీయాలకు బీజేపీ వాడుకుంటోందన్న అభిప్రాయముంది. గులాబీబాస్‌కి ఉన్నట్టుండి జాతీయ రాజకీయాలపై ఇంత ఆసక్తి కలగడం, ఓ పక్క కాంగ్రెస్ మోడీ ముక్త్ భారత్ నినాదాన్నిస్తుంటే..ఇదే సమయంలో బీజేపీ-కాంగ్రెస్సేతర పక్షాల ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు ముందుకు రావడం చూస్తుంటే..దాల్‌మే కుఛ్ కాలా హై. ఎక్కడో కాస్త తేడా కొడుతోంది.

