అడ్రస్ ఓ పట్టాన దొరకలేదు. ఆ చుట్టుపక్కలే వెతుకుతున్నాడని కానీ ఆ ఇల్లెక్కడో తెలుసుకోలేకపోయాడు. ఈలోపు ఫోన్లమీద ఫోన్లు. మొత్తానికి ఎలాగైతేనేం…అడ్రస్ దొరికింది. హమ్మయ్య పనైందని ఊపిరిపీల్చుకున్నాడు ఆ డెలివరీ బాయ్. కాలింగ్ బెల్ కొట్టడమే ఆలస్యం..పగబట్టినట్లు, తరాలుగా శత్రుత్వం ఉన్నట్లు కత్తితో దాడికి దిగింది ఆ మహిళ. సోదరుడు కూడా తోడు కావటంతో రెచ్చిపోయింది. చచ్చాడని వదిలేసింది కానీ లేకుంటే పీక తెగ్గోసేదే..దేశ రాజధానిలో జరిగిందీ దారుణం.
ఇంతకీ ఆ మహిళ అంత పైశాచికంగా ప్రవర్తించడానికి కారణం సెల్‌ఫోన్ డెలివరీ ఆలస్యమైందని. ఆర్డర్ ఇచ్చిన కొత్త ఫోన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చిందని. ఢిల్లీలోని నిహాల్ విహార్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కమల్ దీప్ అనే యువతి ఆన్‌లైన్‌లో రూ.11 వేల విలువైన సెల్‌ఫోన్‌కు ఆర్డర్ చేసింది. ఫోన్ డెలివరీ ఆలస్యం కావటంతో డెలివరీ బాయ్ కేశవ్ కుమార్ సింగ్‌కి ఫోన్లమీద ఫోన్లు చేసింది కమల్ దీప్. మొత్తానికి సెల్‌ఫోన్‌తో ఇంటికొచ్చిన డెలివరీ బాయ్‌పై కమల్ దీప్, ఆమె సోదరుడు జితేందర్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయారు.
షూ లేస్‌తో డెలివరీ బాయ్ గొంతుకు కట్టి బలంగా లాగి చంపేందుకు ప్రయత్నించిన కమల్‌దీప్ అతని కడుపుమీద కూర్చుని కత్తితో దాడి చేసింది. అన్న కూడా మరో కత్తి అందుకుని ఇద్దరూ కలిసి 20 చోట్ల కత్తితో పొడిచారు. ఓ దశలో డెలివరీ బాయ్ మర్మావయాల్ని కూడా కోసేందుకు ప్రయత్నించిందా రాక్షసి. సుమారు 20 నిమిషాల పాటు డెలివరీ బాయ్‌కి నరకం చూపించి స్పృహకోల్పోయిన అతన్ని చనిపోయాడని ఇంటి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశారు. ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
డెలివరీ బాయ్ సింగ్ శరీరంపై మొత్తం 45 కుట్లు వేశారు. విరిగిన చేతికి కట్టుకట్టారు. చావుతప్పి కన్నులొట్టబోయిన కేశవ్ కుమార్‌సింగ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యాడు. తన అరుపులు బయటికి వినిపించకుండా స్పీకర్లని పెద్ద సౌండ్‌తో పెట్టారనీ..తన నోట్లో కత్తిని పెట్టేందుకు కూడా ఆ రాక్షసి ప్రయత్నించిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దారుణానికి పాల్పడ్డ కమల్ దీప్, జితేందర్‌సింగ్‌లను పోలీసులు రిమాండ్‌కి తరలించారు.

