ఎప్పుడైతే బీజేపీకి టీడీపీ మీకో దండమని చెప్పేసిందో….ఏపీలో బీజేపీ కొత్త మిత్రుడు వైసీపీ అనే ప్రచారం జోరందుకుంది. ఏపీ బీజేపీ నేతలతో అమిత్‌షా ప్రత్యేక సమావేశం సమయంలోనే ప్రశాంత్‌కిషోర్ కూడా బీజేపీ చీఫ్‌ని కలిశారన్న వదంతులు వైసీపీని ఇంకాస్త డ్యామేజ్ చేశాయి. ప్రస్తుతం వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్‌కిషోర్‌కి ఈ సమయంలో అమిత్‌షా పనేంటన్న ప్రశ్న మొదలైంది. పీకే ఢిల్లీలోనే లేడనీ, అసలాయన అమిత్‌షాని కలవనేలేదని ఖండనలొచ్చేసరికే…బీజేపీ వైసీపీల మధ్య సయోధ్యకోసం ప్రశాంత్‌కిశోర్ రంగంలోకి దిగాడన్న ప్రచారం ఊరూవాడా చుట్టేసింది.

టీడీపీ వదిలించుకున్న దరిద్రాన్ని జగన్ నెత్తికి చుట్టుకుంటాడా అన్నదే ఇంటాబయటా జరుగుతున్న చర్చ. అడగ్గానే గతంలో జగన్‌కి మోడీ అప్పాయింట్‌మెంట్ ఇవ్వటం, ఈమధ్య పీఎంవోలో విజయసాయిరెడ్డి ప్రత్యక్షమవ్వడం..ప్రత్యేక|హోదా ఇస్తే బీజేపీతో కలిసి కదులుతామని ఆ మధ్య వైసీపీ అధినేత స్టేట్మెంట్ ఇవ్వడం…ఇవన్నీ కాకతాళీయమనుకోవడానికి వీల్లేదు. బీజేపీతో తెగదెంపులు కాగానే ఆ పార్టీతో వైసీపీ బంధంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. వైసీపీతో స్నేహబంధంకోసం జగన్‌మీదున్న కేసుల్ని ఎత్తేస్తారేమోనన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు. ఆ రెండుపార్టీలకు ఆ అవకాశం ఇవ్వకూడదని ముందుగానే బకెట్ల కొద్దీ బురదని ఎత్తిపోస్తోంది టీడీపీ.

టీడీపీ ఏమంటోంది? బీజేపీ ఏం ఆశిస్తోందన్నది పక్కనపెడితే..వెళ్లివెళ్లి జగన్ దృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకుంటాడా అన్నదే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. బీజేపీతో బంధం తెగిపోయినా ఓట్లపరంగా నష్టమేమీ ఉండదని, పైగా ఎంతోకొంత కలిసొస్తుందని టీడీపీ కొత్త లెక్కలు తీస్తోంది. ఇలాంటి సమయంలో వైసీపీ వెళ్లి బీజేపీ ఒళ్లో కూర్చోవడం దుస్సాహసమే. బీజేపీతో దోస్తీకడితే వైసీకీ అండగా ఉన్న దళితులు, ముస్లింల ఓట్లు చేజారే అవకాశం లేకపోలేదు. నాలుగేళ్లక్రితం అప్పట్లో మోడీ మానియా వేరు. ఎంతలేదన్నా టీడీపీకి అప్పట్లో మోడీ హవా ఎంతోకొంత కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు.
టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ బీజేపీని నమ్ముకుంటే మాత్రం…కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈదినట్లే. ఒకవేళ ఎన్నికల తర్వాత కలుద్దామనే అవగాహనతో పరస్పరం సహకరించుకున్నా..అదేం రహస్యంగా ఉండే అవకాశం లేదు. ఇప్పటికే వైసీపీ అధినేత కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారనే అసంతృప్తి పార్టీ సీనియర్లలో ఉంది. బీజేపీ విషయంలో తొందరపాటు ప్రదర్శిస్తే వైసీపీ తన విజయావకాశాలకు గొయ్యి తీసుకున్నట్లే.


