చావ‌యినా రేవ‌యినా మేమే..

0
582

ఎంత ప‌నిచేశావ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..త‌న మానాన తన మార్క్ రాజ‌కీయాన్ని సైలెంట్‌గా చేసుకుపోతున్న చంద్ర‌బాబుని ఒక్క మీటింగ్‌తో ఇంత డిఫెన్స్‌లో ప‌డేశావే! న‌ల‌భైఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మ‌న‌సారా నెమ‌రేసుకునే క్ష‌ణాన గుంటూరు పంచ్ డైలాగుల‌తో మ‌న‌శ్శాంతి లేకుండా చేశావే..ఏపీ ప్ర‌యోజ‌నాల‌కోసం చెక్క‌క‌త్తితో పోరాడుతున్న దిగ్రేట్ చంద్ర‌బాబుని వేట‌క‌త్తి చేత‌బ‌ట్టి ర‌క్తం క‌ళ్ల‌చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి క‌ల్పించావే..హే భ‌గ‌వాన్‌. ఏమిటీ ప‌రీక్ష‌?

చంద్ర‌బాబుని జ‌గ‌న్ ఎంత తిట్టినా, వైసీపీ ఎంత ఆడిపోసుకున్నా అదెప్పుడూ లెక్క‌లోకి రాలేదు. కానీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒక్క మీటింగ్‌తో చంద్ర‌బాబు రాజ‌కీయ సౌధం భూకంపం వ‌చ్చిన‌ట్లు క‌దిలిపోయింది. మొన్న‌టిదాకా ర‌హ‌స్య మిత్రుడిలా ఉన్న జ‌న‌సేనాని షాంపూ, కుంకుడుకాయ‌, సీకాకాయ్ అన్నీ క‌లిసి న‌లుగుపెట్టి మ‌రీ స్నానం చేయించేస‌రికి…త‌న స‌చ్చీల‌త‌ను నిరూపించుకునేందుకు తెలుగుదేశాధినేత ఎంత‌కైనా తెగించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఆ స్థాయిలో ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసేందుకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి తాడూబొంగరం లేక‌పాయ‌. అందుకే త‌న ప్ర‌తి అడుగూ రాష్ట్రం కోస‌మేన‌నీ, త‌న ప్ర‌తీ నిర్ణ‌యంలో చిత్త‌శుద్ధి ఉంద‌నీ నిరూపించుకోక త‌ప్ప‌ని నిస్స‌హాయ పరిస్థితి చంద్ర‌బాబుది.

మొన్న‌టిదాకా బీజేపీ-వైసీపీ కుమ్మ‌క్క‌య్యాయ‌నీ… కేసుల‌కోసం జ‌గ‌న్ మోడీతో లాలూచీ ప‌డ్డార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన టీడీపీ…ఒక్క‌రోజులోనే మ‌న‌సు మార్చుకుని వైసీపీ అవిశ్వాస‌తీర్మానానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం మామూలు విష‌య‌మా! అదేమంటే రాష్ట్రంకోసం రాజ‌కీయాల‌కు అతీతంగా ఎవ‌రికైనా మ‌ద్ద‌తిస్తామ‌ని చ‌క్క‌టి కోటింగ్. కేంద్రంనుంచి మంత్రుల్ని ఉప‌సంహ‌రించుకున్నాక ఎన్డీఏలో కొన‌సాగ‌డం ఏం రాజ‌కీయ‌మో బాబు అండ్ కోకే తెలియాలి. ప‌వ‌న్ ఎటాక్ త‌ర్వాత 24గంట‌ల్లో దీనిపైనా టీడీపీకి త‌త్వం బోధ‌ప‌డింది. ఎన్డీఏనుంచి బ‌య‌టికొస్తేగానీ త‌మ పాతివ్ర‌త్యం ప్ర‌జ‌లు అర్ధంచేసుకోర‌ని కాస్త ఆల‌స్యంగా అర్ధంచేసుకుంది.

అప్పుడే ఏమ‌య్యిందీ? తెల్లారేస‌రికి టీడీపీ ఎత్తుగ‌డ మారింది. బీజేపీతో బావుంటూనే అవిశ్వాస తీర్మానంతో వైసీపీ జాతీయ రాజ‌కీయాల్లో బ‌ల‌ప‌డుతుందేమోన‌ని బాబుగారికి భ‌యం ప‌ట్టుకుంది. అందుకే అవిశ్వాసం నువ్వు పెట్టేదేంటి…ఆ ప‌నేదే నేనే చేస్తాన‌ని ముందుకొచ్చింది. వాస్త‌వానికి ఆ అవ‌కాశం వైసీపీ ఎప్పుడో ఇచ్చింది. ద‌మ్ముంటే కేంద్రంమీద అవిశ్వాసం పెట్టాల‌నీ, తాము మ‌ద్ద‌తిస్తామ‌ని తొడ‌గొట్టి స‌వాలు చేసింది. టీడీపీ క‌లిసొస్తే ఎంపీలంతా రాజీనామా చేస్తే కేంద్రంమీద ఒత్తిడి పెరుగుతుంద‌ని చెబుతూనే ఉంది. అయినా టీడీపీ వింటేగా…వైసీపీ ఉచ్చులో ప‌డ‌బోన‌ని తిప్పికొడుతూ వ‌స్తున్న టీడీపీ చివ‌రికి చేస్తున్న‌దేమిటి?

ఏపీకి ఎలాగైనా నిధులు సాధించాల‌న్న త‌ప‌న కంటే రాజ‌కీయంగా తామే ముందుండాల‌న్న ఆరాటం టీడీపీ ప్ర‌తీ అడుగులో క‌నిపిస్తోంది. అవిశ్వాస నోటీసు ఇవ్వాల‌ని పార్టీ ఎంపీల‌కు ఆదేశాలు అందుకే. అవిశ్వాసం ఎవ‌రు పెడితేనేం. మ‌ద్ద‌తిచ్చి మోడీ స‌ర్కారుని జాతీయ‌స్థాయిలో బోనులో నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఎందుకీ ప‌నికిమాలిన రాజ‌కీయం?