సామాజిక తెలంగాణ అనుకుంటే కుటుంబపాలన వచ్చిందంటూ ఇప్పటికే తెలంగాణలో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు…తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని విరుచుకుపడుతున్నారంతా. అందరిదీ స్వయం ప్రకాశమేననీ…ప్రజల్లో తమను తాము నిరూపించుకుని వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని గులాబీబాస్ ఎంత చెప్పినా తెలంగాణ రాజకీయాల్లో ఫ్యామిలీ పాలిటిక్స్‌పై దుమారం రేగుతూనే ఉంది. ఇప్పుడిక ఈ జాబితాలోకి మరొకరు చేరబోతున్నారన్న వార్త హల్‌చల్ చేస్తోంది.

తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్‌తో సంఖ్యాపరంగా టీఆర్ఎస్ బలోపేతం కావటంతో మూడు సీట్లూ గులాబీ ఖాతాలోకే పడబోతున్నాయి. టీఆర్ఎస్‌నుంచి రాజ్యసభలోకి ఎవరు అడుగుపెడతారన్న చర్చ మొదలైంది. ఆ మధ్య బీసీల్లో యాదవ సామాజికవర్గానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. బహిరంగంగా ఆయన ఈ ప్రకటన చేయటంతో ఆ మాట నిలబెట్టుకునేందుకు యాదవనేతకు ఓ సీటు ఇవ్వాల్సిందే. ఇక మిగిలిన రెండు సీట్లలో ఒకటి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కి ఖాయమన్నదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్.

జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నట్లు జోగినపల్లి గురించి టీఆర్ఎస్ శ్రేణులకు పరిచయం చేయాల్సిన పన్లేదు. సంతోష్ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే సంతోష్. అంత అనుబంధం. ఎవరితోనూ పంచుకోని విషయాల్ని కూడా కేసీఆర్ సంతోష్‌కి చెప్పుకుంటారని పేరు. పదిహేడేళ్లుగా పార్టీతో ఉన్న సంతోష్‌కుమార్ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి. టీఆర్ఎస్ అధికారిక ఛానల్ టీ న్యూస్ ఎండీ. అన్నిటికీ మించి కేసీఆర్ సతీమణి శోభకి స్వయానా సోదరి కుమారుడు. కేసీఆర్‌కి నమ్మినబంటు. అత్యంత విశ్వాసపాత్రుడు. తెల్లారిలేచింది మొదలు రాత్రి కేసీఆర్ విశ్రమించేదాకా ఆయన్ని వెన్నంటి ఉండేది సంతోష్‌కుమారే. ఈ అర్హతలు చాలవా ఆయన్ని రాజ్యసభకు పంపేందుకు?
కేసీఆర్ బంధువుకిస్తున్నారనో, వెలమ వర్గానికే పెద్దపీట వేస్తున్నారనో ఎవరూ విరుచుకుపడే అవకాశం ఇవ్వకుండా ముందే ఓ సీటు బీసీలకి హామీ ఇచ్చేశారు. ఇంకో సీటుని మైనారిటీలకో, ఎస్సీలకో, తెలంగాణ కేబినెట్‌లో మహిళా మంత్రులు లేరనే లోటుని తీర్చేందుకు ఏ అగ్రవర్ణేతర మహిళకో ఇస్తే లెక్క సరిపోతుంది. పార్టీలో సంతోష్ అభ్యర్థిత్వంపై మరో మాటకు తావేలేదు. ఎందుకంటే ఆయన్ని నిలబెట్టటమంటే స్వయానా గులాబీబాస్ నిలబడినట్లే. సో…సంతోష్‌కి ఛాన్సిస్తే కేసీఆర్ కుటుంబంనుంచి ఐదుగురున్నట్లే. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? కేసీఆర్ కరుణకటాక్షాలు ఉండాలేగానీ ఏదీ అసాధ్యం కాదు. ఎనీడౌట్స్?


