65 ఏళ్ల వయసు. అయినా నడివయస్సులో కూడా పడలేదన్నంత ఫిట్‌నెస్. యుఎస్ఎస్ఆర్ చీలికలు పీలికలయ్యాక కూడా రష్యాకి తిరుగులేని అధ్యక్షుడిగా చెలామణి. వరసగా నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్ పుతిన్ ఎన్నిక మామూలు విషయం కాదు. ప్రత్యర్థులనే లేకుండా చేసుకున్న పుతిన్‌పై రష్యా ప్రజలకున్న అపార నమ్మకానికి నిదర్శనమీ ఎన్నిక. 76.67 ఓట్లతో నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పుతిన్. ఆరేళ్లపాటు..అంటే 2024దాకా ఆయనే అధ్యక్షుడు.
వాస్తవానికి పుతిన్‌తో పాటు మరో ఏడుగురు అభ్యర్థులు రష్యా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే న్యాయపరమైన కారణాలతో పుతిన్ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ బరిలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పుతిన్ ఎన్నిక లాంఛనప్రాయమే అయ్యింది. 19ఏళ్ల క్రితం 1999లో పుతిన్ తొలిసారిగా రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సోవియెట్ నియంత జోసఫ్ స్టాలిన్ తర్వాత రష్యాని సుదీర్ఘ కాలం పాలించిన నాయకుడిగా చరిత్రకెక్కారు పుతిన్.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ఫిట్‌నెస్ కోసం అనుసరించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా ఫిట్‌నెస్ కోసం ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలని అనుకుంటారు. అలాగే రాత్రి త్వరగా నిద్రపోవాలని భావిస్తుంటారు. అయితే పుతిన్ దీనికి పూర్తి రివర్స్. పుతిన్ ఉదయం లేటుగా లేస్తారు. టిఫిన్ చేసేసరికే మధ్యాహ్నం అయిపోతుంది. కప్పు ఓట్‌మీల్, ఓ ఆమ్లెట్టే ఆయన లంచ్. దీంతో పాటు ఒక గుడ్డు, ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు.
నిఘా సంస్థ కేజీబీలో ఓ అధికారి స్థాయి నుంచి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వరకూ పుతిన్ ప్రస్థానం అసాధారణంగా కనిపిస్తుంది. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్న మొదటి ఎనిమిదేళ్లలో రష్యా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. దీంతో ఆయన తన అధికారం సుస్థిరం చేసుకోగలిగారు. ప్రభుత్వంపై తిరుగులేని పట్టు సంపాదించారు అయితే, గత ఆరేళ్లలో పాశ్చాత్యదేశాల ఆంక్షలతో రష్యా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. అయినా సిరియా అంతర్యుద్ధంలో జోక్యం, క్రిమియా ఆక్రమణ ద్వారా దేశాన్ని పుతిన్ అగ్రరాజ్యం దిశగానే నడిపిస్తున్నారని రష్యన్లు విశ్వసిస్తున్నారు.

