
నవతరం, రావులపాలెం: “పేరు గొప్ప ఊరుదిబ్బ” అనే సామెత ఉంది. ఇది అక్షరాలా ఘనత వహించిన మన ఆంద్రప్రదేశ్ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (ఏపిఎస్ ఆర్టీసీ)కి సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ సంస్థ ఆసియా లొనే అతి పెద్దదిగా గొప్పలు చెప్పుకొనేవాళ్ళం. “సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ లో ప్రయాణం చెయ్యండి”, “ఆర్టీసీ ప్రయాణం సురక్షితం” అంటూ ప్రయాణికుల్ని ప్రవేట్ వాహనాల వైపు నుంచి దృష్టి మల్లించి ఆర్టీసీ వైపుకు వచ్చేలా ఇలా రకరకాల సొగన్లతో ఉదరగొట్టేవారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ పై ప్రయాణం అంటే దైవాధీనం అని చెప్పక తప్పదు.ప్రాణం అరచేతిలో పెట్టుకుని దేవుడి పై భారం వేసి “హారే రామ, హరే కృష్ణా” అని జపం చేసుకొంటూ ప్రాయాణించవలసిందే. గమ్యస్థానం చేరేవరకు జీవితంపై ఆశ వదులు కోవలసిందే. సంస్థ గత దశాబ్ద కాలంగా కనీసం పట్టుమని పది కొత్త బస్సులు కొన్న పాపాన పోలేదు. కాలం చెల్లిన డొక్కు బస్సుల తోనే కాలక్షేపం చేస్తూ వస్తోంది. పోనీ రహదారులు ఏమన్నా బాగున్నాయా… అంటే, రోడ్లు అన్నీ అస్తవ్యస్తం. కొత్త వాహనాలే ఈ రోడ్లపై నెల రోజులు తిరిగే సరికి షెడ్లుకు వెళ్లిపోతున్నాయి. ఏళ్ళ తరబడి సేవలందించి, స్క్రాప్ షెడ్లో విశ్రాంతి తీసుకోవలసిన కాలం చెల్లిన బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో ఈ ప్రభుత్వాలు చెలగాటం అడుతున్నాయి. ఈ గోతుల్లో పడి ఎప్పుడు ఏ బస్సు చక్రాలు ఉడిపోతాయో తెలియదు. బస్సు ఎక్కింది మొదలు ఒకటే శబ్దం. సీట్లు ఉడిపోతాయి. రేకులు లేచిపోతాయి, ఇక వర్షం కురిస్తే చెప్పనవసరమే లేదు. బస్సు అంతా వర్షమే. ప్రభుత్వాలు ఆర్టీసీని ఆదాయ వనరుగా చూస్తున్నాయే తప్ప ప్రజల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ గా చూడంలేదు. గతంలోనూ ప్రభుత్వాలు ఇదేవిధంగా వ్యవహరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో సంస్థ నష్టాల్లో ఉందని సంస్థ ఆక్యుపెన్సీ పెంచేందుకు కార్మికుల చేత బలవంతంగా పనిభారం కూడా పెంచింది. నష్టాలను వంక చూపించి పాత బస్సులు, అద్దె బస్సులతోనే కాలక్షేపం చేస్తూ వచ్చింది. ప్రయాణికులకు, కార్మికులకు రక్షణ లేదంటూ పలుమార్లు కార్మికులు సమ్మెలు కూడా చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం గానీ, వైసీపీ ప్రభుత్వం గానీ ఆర్టీసీకి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను ఉద్యోగులుగా గుర్తించిందే తప్ప ఒక్క కొత్త బస్సును కొనుగోలు చేసిన పాపాన పోలేదు. డీజిల్ ధరల పెరుగుదల పేరు చెప్పి రెండు సార్లు చార్జీలు పెంచింది. ప్రయాణికులపై తరచూ భారం పెంచుతుందే గానీ వారి రక్షణకు మాత్రం ఎటువంటి చర్యలు చేబట్టడం లేదు. ఇటీవల కాలంలో ఈ కాలంచెల్లిన బస్సులు ఏడెనిమిది చోట్ల బస్సు చక్రాలు ఊడిపోయి పెద్దపెద్ద ప్రమాదాలే జరిగాయి. అయినా ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం ప్రజల ప్రాణాలు అంటే వీరికి ఎంత చులకనో తెలుస్తోంది.
సీనియర్ రిపోర్టర్ రావులపాలెం. బోగిశెట్టి నాగేశ్వరరావు

