

చంద్రబాబు చేతకాని పాలనకు ఇదే నిదర్శనం…
రెండు నెలలు గడుస్తున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం.
మాజీ ఎమ్మెల్యే దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్.
నవతరం, విశాఖపట్నం: అక్టోబర్ 9వ తేదీన బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులను తక్షణమే విడిపించుకునేలా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆసీలమెట్ట కార్యాలయంలో శనివారం రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఇతర వైసీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులు ఓట్లతో గెలిచి వారి బాగోగులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. భోగాపురం నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారుల మిత్ర దేశమైన బంగ్లాదేశ్ లో చిక్కుకుపోతే రెండు నెలలైనా వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోగా ఉపాధి కోల్పోయిన ఆయా మత్స్యకార కుటుంబాలకి కనీస సాయం అందించలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆయా 9 మంది మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5000లు చొప్పున రూ. 45,000లు తోటి మత్స్యకారుడుగా సహాయం అందిస్తానని ఈ సందర్భంగా వాసుపల్లి ప్రకటించారు.
జనసేన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో మత్స్యకారులకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ముందు ఒకలా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడటం విడ్డూరం అన్నారు. వైసిపి ప్రభుత్వం ఉంటే మత్స్యకారుల పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని వాసుపల్లి స్పష్టం చేశారు. మత్స్యకారులు అంటే మొదటి నుండి చిన్న చూపు చూసే చంద్రబాబు వైఖరి ఇప్పటికీ మారలేదన్నారు.
బంగ్లాదేశ్ నేవీకి చిక్కిన వారు బయటకు వచ్చేసరికి ఆరు నెలలు పడుతుందని చెప్పడం దారుణం అన్నారు. మత్స్యకారులు కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే వారిని విడిపించడంతో పాటు ఆ కుటుంబాల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వాసుపల్లి కోరారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా మాట్లాడటం జనసేన పార్టీకే సిగ్గు అని వాసుపల్లి అన్నారు.

