
ఔరా…అనిపిస్తున్న ఆయన చేష్టలు…–నిత్సాహాయత లో అధికారులు…
నవతరం, రావులపాలెం: ఆయన మొఖంలో అమాయకత్వం.. అతనిలో అతివినయం. ఈరెండే అతన్ని అందలమెక్కించాయి. ఆయన ఇప్పుడు రావులపాలెం మండలంలో అధికార పార్టీకి చెందిన ఒక మేజర్ గ్రామ పంచాయితీకి ప్రతినిధి. ఆయన ఎమ్మెల్యేకి వీర విధేయుడుగా, పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కనిపిస్తాడు. ఇది నాణానికి ఒకవైపు… మరోవైపు ఉందండోయ్. ఆ పంచాయతీలో అతని మాటే శాసనం. రూల్స్, రెగ్యులేషన్ ఆయకి అక్కర్లేదు, అది తప్పు అనిచెప్పే దౌర్యం అక్కడి అధికారులకు లేదు. అధికార పార్టీ అండ చూసుకోనో, లేక ఆతన్ని సర్పంచ్ ని చేసిన అధినేతను చూసుకోనో ఆ పదవిని అడ్డంపెట్టుకుని ఆగ్రామానికి అతనే రాజు, అతనే మంత్రిగా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మండంలోనే కాదు, నియోజకవర్గంలో చర్చ అంతా ఆయన గురించే. సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న పనులు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో, ఏది మన మెడకు చుట్టుకుంటుందో అని అధికారులు హడలిపోతున్నారు. అసలు ఉద్యోగమే అంటూ ఉంటే ఎక్కడో అక్కడ చేసుకోవచ్చు అని ఓ అధికారి దీర్ఘకాలిక శెలవు పై వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. ఈయన గారు పంచాయతీ సర్పంచి పదవిని అడ్డం పెట్టుకుని చేస్తున్న పనులు గ్రామంలో కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ప్రభుత్వం ఆ గ్రామానికి గ్రామ సచివాలయం–2, ఆరోగ్య కేంద్రం మంజూరు చేస్తే, అసలు బిల్డింగ్ లే కట్టకుండా అధికారులపై వత్తిడి తెచ్చి బిల్లులు చేయించుకున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు వాటి కోసం తెచ్చిన మెటీరియల్ తో తన ఇంటికి పైస్టర్ వేసుకున్నాడని స్థానికులు అంటున్నారు. గ్రామ పంచాయితీకి వేలాది కొబ్బరి చెట్లు ఉన్నాయి. వీటిని పాట పాడుకున్న పాట దారుడు డబ్బు కట్టక మధ్యలోనే వదిలేసాడు. గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం వాటికి మళ్లీ తిరిగి పాట పెట్టవలసి ఉండగా, ఏడాది కావస్తున్నా వాటికి పాట నిర్వహించకుండా ఈయనే స్వయంగా దింపు తీసేస్తున్నాడని, కాయలు వల్ల వచ్చిన ఆదాయం ఈయన పంచాయతీ కి ఎంత జమ చేస్తే అంతే అంటున్నారు గ్రామస్థులు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. అందులో భాగంగా రావులపాలెం లబ్దిదారులకు రావులపాలెంలో భూమి లభ్యం కాకపోవడంతో ఆగ్రామంలో సుమారు 52 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు వ్యవహారంలో రైతులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య ఈయన గారే మధ్య వర్తిగా వ్యవహరించారని, ఈ వ్యవహారంలో ఈయన గారికి భారీగా ముట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇందులో ఉన్న 300 వరకు కొబ్బరి చెట్ల కాయలను ఈయనే నెలనెలా తీసుకుని లక్షల్లో స్వాహా చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అలాగే హౌస్ టాక్స్ సైతం పంచాయతీ కి జమ చేయకుండా తన సొంతానికి వాదుకున్నాడని దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈయన నిర్వాకంపై ప్రతిపక్షం లొనే కాదు, అధికార పక్షంలోనూ అసమ్మతి సెగలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన వల్ల గ్రామం మొత్తం అధికార పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయినా అధినేత అతగాడి ఆగడాలకు కళ్లెం వేసే సాహసం చేయడం లేదని ఆపార్టీ వారే ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ అతిపెద్ద గ్రామ పంచాయితీలలో ఇదీ ఒకటి. అటువంటిది ఇతని చేష్టలు కారణంగా గ్రామస్తులంతా దూరమైపోతున్నా అతన్ని పార్టీ దూరం పెట్టడం లేదంటే…. అతని అతి వినయానికీ, అతనిపై అధినేతకు ఉన్న మమకారానికీ… హ్యేడ్సప్..!

