సీఎం కేసీఆర్‌కు దన్నుగా పవార్‌, ఠాక్రే…

0
208

• సీఎం కేసీఆర్‌కు దన్నుగా పవార్‌, ఠాక్రే
• కేసీఆర్‌ వాదనతో వందశాతం ఏకీభావం
• బీజేపీ కూటమి నుంచి దేశాన్ని కాపాడాలి
• అందుకు అంతా కలిసికట్టుగా పోరాడాలి
• ముగ్గురు అగ్రనాయకుల ఏకాభిప్రాయం
• దేశంలో విపక్షాల బలాబలాలపైనా చర్చ
• ఆశించిన దానికంటే కేసీఆర్‌ టూర్‌ సఫలం
• బీజేపీ, పరివార్‌ లో ‘కేసీఆర్‌’ గుబులు
నవతరం, ముంబై: అపశకున పక్షుల నోళ్లు మూయించేలా, సందేహరాయుళ్లకు సమాధానమిచ్చేలా, బీజేపీ జాతీయ నేతలకు గుబులు పుట్టించేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం చేపట్టిన ముంబై టూర్‌ ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలమైంది.
బీజేపీ, మోదీ, అమిత్‌షా పోకడలు దేశానికి, జాతీయ సమగ్రతకు, మత సామరస్యానికి, రాష్ర్టాల హక్కులకు, సమాఖ్య స్ఫూర్తికి పెను ప్రమాదంగా మారాయన్న సీఎం కేసీఆర్‌ వాదనతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీనియర్‌ రాజకీయ నాయకుడు శరద్‌పవార్‌ నూటికి నూరుపాళ్లు ఏకీభవించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దేశభక్తి, మతోన్మాదాన్ని అండగా చేసుకొని సోషల్‌ మీడియా దన్నుగా బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని.. ఈ విషయంలో ఓటర్లను, ముఖ్యంగా యువతను పూర్తిగా జాగృతపరిచి.. పొంచి ఉన్న ప్రమాదం నుంచి జాతిని కాపాడాల్సిన అవసరం ఉన్నదని ముగ్గురు అగ్రనేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. జాతిలో కలుషిత బీజాలు నాటుతున్న బీజేపీ నుంచి దేశాన్ని కాపాడేందుకు అందరం కలిసికట్టుగా పోరాడవలసిన అవసరం ఉన్నదన్న సీఎం కేసీఆర్‌ వాదనతో పవార్‌, ఉద్ధవ్‌ఠాక్రే ఏకీభవించినట్టు తెలిసింది. ఈ పోరాటాన్ని ఉద్యమస్ఫూర్తితో ముందుండి నడిపించాలని సీఎం కేసీఆర్‌ను ఇద్దరు నేతలూ కోరారు. కేసీఆర్‌ పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. మోదీ, షా ద్వయం వల్ల దేశానికి ఏర్పడుతున్న ముప్పును ధైర్యంగా బయటపెట్టిన కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. బీజేపీ తరహా ఒత్తిళ్లకు భయపడకుండా బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి కేసీఆర్‌ చేస్తున్న కృషిని జాతి ఎప్పటికీ గుర్తుంచుకొంటుందని ఠాక్రే, పవార్‌ కొనియాడినట్టు సమాచారం. అత్యంత సాహసోపేతమైన రీతిలో కేసీఆర్‌ చేస్తున్న పోరాటాన్ని వారిద్దరూ ప్రశంసించినట్టు తెలిసింది. దేశం కోసం ప్రారంభించిన ప్రయత్నాలను ఒక తార్కిక ముగింపునకు తెచ్చేందుకు కృషిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు కోరినట్టు సమాచారం. ఇందుకోసం తాము ఎలాంటి శషభిషలకు తావులేకుండా.. ఎలాంటి షరతులు లేకుండా కేసీఆర్‌ వెంట ఉంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

పార్టీల బలాబలాలపై చర్చ!
ఠాక్రే, పవార్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీలో దేశంలోని బీజేపీ, ఇతర విపక్షాల బలాబలాలపై సంపూర్ణ చర్చ జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా దక్షిణాదిలో మొత్తం 130 స్థానాలు ఉండగా.. వాటిలో 20 సీట్లు కూడా దక్కకుండా చూడాలని అభిప్రాయపడినట్టు సమాచారం. మరోపక్క పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో కనిపించిన బలం వాపేనని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ ఆ పార్టీ పరిస్థితి డోలాయమానంగానే ఉన్నది. మొత్తంమీద 220కుపైగా సీట్లలో బీజేపీకి బలం లేదని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ బలం తగ్గడం ఖాయంగా కనిపిస్తున్నదని వారు పేర్కొన్నట్టు సమాచారం.

దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం సీట్లు 130 అందులో తమిళనాడు 39, ఆంద్రప్రదేశ్ 25, కర్ణాటక 28, తెలంగాణ 17, కేరళ 20, పుదిచ్చేరి 1 ఇందులో బిజెపికి అనుకూలంగా కర్ణాటక 25, తెలంగాణ 4 మొత్తం 29 బిజెపికి వ్యతిరేకంగా 101 ఉన్నయి. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపికి బలం లేదనే చెప్పాలి.

తెలంగాణ పథకాలు అద్భుతం
తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశంసల వర్షం కురిపించారు. పొరుగున ఉన్న రాష్ట్రంగా తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు తమకు తెలుస్తున్నాయని కేసీఆర్‌తో ఠాక్రే అన్నారు. ఈ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచేసే విషయంలో లోతుగా అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు.

బీజేపీ నేతల్లో గుబులు..
మోదీ దేశ వ్యతిరేక పోకడలకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన ప్రయత్నాలను బీజేపీ, సంఘ్‌పరివార్‌ నేతలు విస్మయంగా గమనిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ముంబై పర్యటనను వారు అత్యంత ఆసక్తితో గమనించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్తృత జాతీయ ఎజెండాను ఎత్తుకోవడం.. అ ఎజెండాతో తానే స్వయంగా చొరవ తీసుకొని విపక్షాలను కలవడం.. విపక్ష నేతలు ముక్తకంఠంతో సీఎం కేసీఆర్‌కు సంపూర్ణంగా మద్దతును ప్రకటించడం బీజేపీకి ప్రతికూలమని బీజేపీ, పరివార్‌ నేతలు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమేనని చర్చల్లో పాల్గొన్న శివసేన, ఎన్సీపీ నేతలు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బీజేపీ తెలంగాణ నేతలు అనుసరించిన తప్పుడు వ్యూహం, నిర్ణయాల వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని.. ఇదే సీఎం కేసీఆర్‌ ఇక్కడిదాకా రావడానికి కారణమైందని పరివారం అభిప్రాయపడినట్టు తెలిసింది. గతంలో అనేక విషయాల్లో కేంద్రానికి మద్దతునిచ్చిన కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ నేతలు నిర్హేతుకంగా, దాడిచేయడం, రెచ్చగొట్టడం వంటి చర్యలే బీజేపీ అవకాశాలకు ముప్పుగా మారాయని వారన్నట్టు సమాచారం.