బీజేపీతో పాటు తమకూ నాలుగు అక్షింతలేస్తాడని అనుకున్నారేకానీ పవన్‌కళ్యాణ్ ఈ రేంజ్‌లో రియాక్ట్ అవుతాడని ఏమాత్రం ఊహించలేదు టీడీపీ. ఏపీలో టీడీపీ పాలనని చాకిరేవు పెట్టేశాడు జనసేనాని. చంద్రబాబుపై తన అంచనాలు తలకిందులయ్యాయని దుమ్మెత్తిపోశాడు. అవినీతిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందని చంద్రబాబు పరువు తీసేశాడు.
చంద్రబాబుతోనే ఆగలేదు పవన్‌కళ్యాణ్. ఆయన వారసుడు లోకేష్‌ని చెడుగుడు ఆడేసుకున్నాడు. ప్రభుత్వంలో తెరవెనుక అన్నీ తానై చక్రం తిప్పుతున్న నారావారి పుత్రరత్నాన్ని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశాడు. విపక్షం కూడా చంద్రబాబు తనయుడ్ని ఈ స్థాయిలో తిట్టలేదు. మీ కుమారుడి అవినీతి భాగోతం అసలు మీకు తెలుసా అంటూ ఏపీ సీఎంని జనం సాక్షిగా సూటిగా ప్రశ్నించాడు పవన్‌కళ్యాణ్.
‘మీ అవినీతిని చూసి ప్రజలు భయపడుతున్నారు. ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోంది. అవినీతికి అంతు లేదా. ఎన్ని వేల ఎకరాలు కావాలి.. ఎన్ని కోట్లు తింటారు. దోచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన వారిని తరిమికొట్టాలి’ అని పవన్ పిలుపునిచ్చారు. మీ హెరిటేజ్ నుంచి డబ్బులు తీయడం లేదు కదా? మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవడం లేదు కదా?. మరి ఎక్కడ నుంచి వస్తున్నాయి డబ్బులంటూ..పవన్‌కళ్యాణ్ చేసిన విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు టీడీపీ నేతలు. అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటారా? తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతారా?

