రాష్ట్ర‌మా? రాజ‌కీయ‌మా? ఏది ముఖ్యం?

0
492

లేస్తే మ‌నిషిని కాద‌న్నాట్ట వెనుక‌టికొక‌డు. లేచేది ఉండ‌దు. ఎవ‌రేం చూసేదీ ఉండ‌దు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అచ్చం అలాగే ఉంది టీడీపీ పరిస్థితి. మోడీ నోటితో మాట్లాడుతూ నొస‌టితో వెక్కిరిస్తున్నా..విభ‌జ‌న చ‌ట్టాన్ని ప‌క్క‌న ప‌డేసి అప్పుడ‌ప్పుడూ ముష్టేసిన‌ట్లు కాస్త చిల్ల‌ర ప‌డేస్తున్నా…టీడీపీ నాయ‌క‌త్వం ఇంకా ఎవ‌రికోసం ఓపిక‌ప‌డుతోందో, ఎందుకంత సహ‌నం వ‌హిస్తుందో ఒక్క చంద్ర‌బాబుకు త‌ప్ప ఎవ‌రికీ అర్ధంకావ‌డంలేదు. ఒక‌టా రెండా…రాష్ట్రాన్ని విభ‌జించి నాలుగేళ్ల‌య్యింది. త‌మ క‌ళ్లెదుటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగింద‌నీ, ఆ రోజు ఉభ‌య స‌భ‌ల్లో ఆ ప్ర‌క్రియ‌కు తాము మ‌ద్ద‌తిచ్చామ‌ని మోడీ గ‌జ‌నీలా మ‌ర్చిపోయార‌నుకోవాలా…మీ చావు మీరు చావండ‌ని ఏపీని అనాథ‌లా వ‌దిలేశార‌నుకోవాలా? కాస్త క‌నిక‌రించండంటూ వెళ్లిన‌ప్పుడ‌ల్లా వంగొంగి దండాలు పెడుతున్నా…కేంద్రం ద‌య‌త‌లిచిందెక్క‌డ‌?
ప్ర‌త్యేక‌హోదాపై అప్ప‌ట్లో పార్ల‌మెంట్‌లో ఎంత చ‌ర్చ జ‌రిగిందో ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. ఐదేళ్లు చాల‌దు..ప‌దేళ్ల‌న్నారు. ప‌దిహేనేళ్లిచ్చినా త‌క్కువే అన్నారు. ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వ‌చ్చిందో అప్పుడే స్పెష‌ల్ స్టేట‌స్ ముగిసిన అధ్యాయ‌మైపోయింది. హోదాగురించి నోరెత్త‌కుండా ప్ర‌త్యేక ప్యాకేజీని తెర‌పైకి తెచ్చి దాని ఊసే ఎత్త‌డం లేదంటే ఇంత‌కంటే వంచ‌న ఇంకేముంటుంది? ప్ర‌త్యేక‌హోదా అంశాన్ని కాంగ్రెస్ విభ‌జ‌న చ‌ట్టంలో ఎందుకు పొందుప‌ర‌చ‌లేద‌ని బుకాయించిన కేంద్రం చ‌ట్టంలో హామీఇచ్చిన రైల్వేజోన్‌ని లాభ‌దాయకం కాద‌నే సాకుతో ఎగ్గొట్టేసి నిస్సిగ్గుగా స‌మ‌ర్ధించుకుంటోంది. ఇక పోల‌వ‌రం, ఆర్థిక‌లోటు, విభ‌జ‌న స‌మ‌స్య‌లు చెబుతూ పోతే చాట‌భార‌త‌మే. ఇంకో ఏడాదిలో ఎన్నిక‌లుండ‌టంతో చివ‌రి బ‌డ్జెట్ అయినా చంక‌లు గుద్దుకునేలా ఉంటుంద‌ని…పాపం మొన్న‌టిదాకా దింపుడుక‌ళ్లెం ఆశ‌. ఆ ముచ్చ‌టా తీరిపోవ‌టంతో వేచిచూద్దామ‌నే మాట ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకునే జోకులా మారిపోయింది.
బ‌డ్జెట్ త‌ర్వాత చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. పార్టీ ఎంపీలు, మంత్రులు, ముఖ్య‌నేత‌ల‌తో ఎడ‌తెరిపిలేని స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు. బీజేపీతో తెగ‌దెంపుల‌కు సిద్ధ‌మ‌నే లీకులిస్తున్నారు. కేంద్ర‌హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కంగారుప‌డిపోయి బాబుకోసం మూడుసార్లు ఫోన్ ట్రైచేశార‌నీ, అమిత్‌షా ఏపీ బీజేపీ నేత‌ల‌కు క్లాసు పీకార‌నీ..వాస్త‌వ‌మెంతోగానీ ఎవ‌రి తుత్తికొద్దీ వాళ్లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. పోతేపోనీ అంటూ అమిత్‌షా లైట్ తీసుకున్నారంటూ మ‌రో వార్త‌. అన్నిటికీ రాజీప‌డిపోవ‌డానికి టీడీపీ అధినేత అమ్ముల‌పొదిలో “రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోస‌మే” అన్న అస్త్రం ఉండ‌నేఉంది. కానీ రాష్ట్రానికి ఒరుగుతున్న‌దేమీ లేదు. అలాగ‌ని టీడీపీ రాజ‌కీయంగా బావుకునేదేం ఉండ‌బోదు. బ‌హుశా చివ‌రిదాకా చూసి…అప్ప‌టి పొలిటిక‌ల్ ఈక్వేష‌న్ల‌న్నీ లెక్క‌లేసి అప్పుడో నిర్ణ‌యానికి వద్దామ‌నేమో!? అటు బీజేపీ బుద్ధికూడా వంక‌రే. దాని ఆలోచ‌నెలా ఉందో. ఈ రాజకీయ డ్రామాలో ఏపీ ప్ర‌జ‌లు ఇంకెంత న‌ష్ట‌పోవాలో?