బిగ్గరగా నవ్వడం, నిర్మొహమాటంగా మాట్లాడటం…కోపమొస్తే అపరకాళిలా ఊగిపోవడం రేణుకాచౌదరికి కొత్తేంకాదు. మరి మోడీకి ఆమె నవ్వు కొత్తగా ఎందుకు అనిపించిందోగానీ నోరుజారేశారు. రామాయణంలో శూర్పణఖతో పోల్చేశారు. దీంతో కాంగ్రెస్ పోస్టర్లలో ద్రౌపదిగా మారిపోయారు రేణుకాచౌదరి. నిండుసభలో ఆమెకు అవమానం జరుగుతుంటే మానమర్యాదలు కాపాడే కృష్ణుడిగా రాహుల్ అవతరించారు. బీజేపీవాళ్లు కౌరవులైతే కాంగ్రెస్ నేతలు పాండవులన్నమాట. పార్లమెంట్‌లో ఉన్న సీనియర్ లీడర్ ఎల్‌కే అద్వానీకి కూడా ఆయన వయసుకు తగ్గ పాత్ర ఇచ్చారు. చుట్టూ ఏం జరుగుతున్నా బాధపడటమే తప్ప నోరెత్తలేని దృతరాష్ట్రుడి కేరక్టర్ ఆయనదే.
ఈ మోడీ పోయిపోయి రేణుకాచౌదరిని ఎందుకంత మాటన్నారోనని బీజేపీ నాయకులు పీక్కోలేకలాక్కోలేక చస్తున్నారు. ఇప్పుడు రేణుకాచౌదరి ఇదే పాయింట్‌పై ప్రతీచోటా హైలెట్ అవుతున్నారు. రాజ్యసభలో నవ్విన తనను శూర్పణఖతో పోల్చిన ప్రధాని నరేంద్ర మోడీపై ఆమె ఎదురుదాడికి దిగుతున్నారు. నవ్వుపై జీఎస్‌టీ లేదని, తాను నవ్వడానికి ఎవరి నుంచీ అనుమతి తీసుకోవలసిన అవసరం అంతకన్నా లేదని ఆమె స్పష్టం చేశారు.
మోడీకి ఆడవాళ్లంటే అస్సలు గౌరవం లేదని ఊరూవాడా చాటేందుకు రేణుకాచౌదరి నడుంబిగించారు. మోడీ వ్యాఖ్యలు మహిళలపై ఆయన ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. తన నవ్వుపై మోడీ వ్యాఖ్యలు చేసిన తరువాత దేశవ్యాప్తంగా మహిళల నుంచి తనకు పెద్ద ఎత్తున మద్దతు లభించిందని తెలిపారు. అయిదుసార్లు ఎంపీగా గెలిచిన తనను ప్రధాని ఒక ప్రతికూల పాత్రతో పోల్చారన్న రేణుకా..ఈ రోజు మహిళలు మారిపోయారనే విషయాన్ని ఆయన మరచిపోయారని ప్రధానిని ఎత్తిపొడిచారు.

