జగన్ గద్దెనెక్కుతాడనుకుంటే రాష్ట్ర విభజనతో సీన్ మారిపోయింది. చంద్రబాబుకే అధికారం దక్కింది. దీంతో నాలుగేళ్లుగా అసహనంతో రగిలిపోతోంది వైసీపీ. ప్రస్తుతం పాదయాత్రలో చంద్రబాబుని, టీడీపీ సర్కారునీ దుమ్మెత్తిపోస్తున్నారు జగన్. రాజకీయ చదరంగంలో విసిరే పాచికల్ని బట్టి, వేసే ఎత్తుగడల్ని బట్టే గెలుపోటములు ఉంటాయి. విపక్షం చేస్తోంది కూడా అదే. రాజకీయాల్లో ప్రత్యక్ష శత్రువులుంటారు. రహస్య మిత్రులుంటారు. వ్యూహాలు మారుతుంటాయి. కానీ ఢిల్లీలో చక్రం తిప్పేందుకు జగన్ ఏరికోరి రాజ్యసభకు పంపిన విజయసాయిరెడ్డి ఎత్తుగడలు పార్టీ నేతలకే అంతుపట్టటం లేదు.
ఎన్డీఏకి టీడీపీ గుడ్‌బై చెప్పటంతో సహజంగానే ఏపీలో వచ్చే ఎన్నికల్లో తనతో చేతులు కలిపే కొత్త మిత్రుడికోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. పవన్‌కళ్యాణ్ ఎప్పుడెలా ఉంటాడో తెలీదన్న విషయం అర్ధమైపోవటంతో బీజేపీకున్న ఆప్షన్ వైసీపీనే. దానికి తగ్గట్లే వైసీపీ కూడా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉందని జరుగుతున్న పరిణామాలతో తెలిసిపోతోంది. టీడీపీ-వైసీపీల మ్యాచ్‌ఫిక్సింగ్‌పై టీడీపీ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. స్పెషల్ స్టేటస్ సెంటిమెంట్‌ని రగిలించి…కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని ఇప్పటికే ప్రజల్లో చర్చ పెట్టింది. బీజేపీతో అంటకాగితే తమ కొంప మునుగుతుందని వైసీపీ నేతలే భయపడే పరిస్థితిని కల్పించింది.
ఇప్పటికే విజయసాయిరెడ్డి ఢిల్లీలో పీఎంవో చుట్టూ తిరుగుతున్నారనీ…ఏ2కి ప్రధానితో పనేంటంటూ దుమ్మెత్తిపోస్తున్న టీడీపీకి మరిన్ని అవకాశాలిస్తున్నారు పొలిటికల్ ఆడిటర్. దొంగచాటుగా ఎవరినీ కలవాల్సిన అవసరంలేదంటూనే మోడీ మీద ఈగవాలకుండా చూసే బాధ్యతని భుజానికెత్తుకున్నారు. ప్రధాని మోడీ హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోనంటూ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనతో టీడీపీ ప్రచారం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేలా ఉంది. మోడీని కాపాడేందుకు బీజేపీలో ఎవరూ లేనట్లు…మోడీ నోట్లో నాలుకే లేనట్లు ఆయన్ని వెనకేసుకురావాల్సిన అవసరం వైసీపీ ఎంపీకి ఏంటన్నదే ప్రశ్న.
పీఎంవోలో కనిపిస్తున్నారనీ, మొన్న రాజ్యసభలో మోడీ కాళ్లమీద పడ్డారనే విమర్శలతో ఇప్పటికే తను బద్నాం కావడమే కాకుండా పార్టీని ఇరకాటంలో పడేశారు విజయసాయిరెడ్డి. ఏపీ హక్కులగురించీ, అవసరాల గురించి చట్టసభలో గొంతెత్తకుండా…టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలోనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. పీఎంవోని నిందించినందుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా మోడీ జోలికొస్తే ఊరుకునేది లేదన్నట్లు మాట్లాడుతున్నారు. మాంసం తిన్నామని ఎముకలు మెళ్లో వేసుకుని తిరుగుతారా? బీజేపీకి దగ్గరయ్యేందుకు మరీ ఇంతగా భుజాన మోసేయ్యాలా?

