2014 ఎన్నికల్లో నగరిలో గెలవాల్సింది. అదృష్టం మొహంచాటేసింది. గెలిచుంటే టీడీపీలో ఆయనకున్న సీనియారిటీకి ఈపాటికి మంత్రిపదవిలో ఉండేవాడాయన. సరే ఎమ్మెల్సీ పదవి దక్కింది అంతే చాలని ..వచ్చే ఎన్నికల్లో నగరిపై గురిపెట్టిన గాలి ముద్దుకృష్ణమనాయుడిని ఈసారి విధి వెక్కిరించింది. చెట్టంత మనిషిని గుప్పెడంత ఉండే గుండె కట్టెలా మార్చేసింది. ఎన్నికలకు ఏడాది ముందు ఎవరూ ఊహించని విషాదమిది. ఇప్పటిదాకా నగరిలో ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి ఆలోచించాల్సిన అవసరమే టీడీపీ అధినాయకత్వానికి రాలేదు. కానీ గాలి కన్నుమూతతో ఇప్పుడక్కడ ఆయన బాధ్యతలు భుజానికెత్తుకునేది ఎవరన్న ప్రశ్న మొదలైంది.
ఆనవాయితీ ప్రకారం కుటుంబసభ్యులనే పోటీకి దించుతుంది టీడీపీ కూడా. అయితే గాలి ముద్దుకృష్ణమకి ఒకరికిద్దరు వారసులున్నారు. ఇద్దరూ రాజకీయంగా లైన్‌లోనే ఉండటంతో వీరిలో ఎవరిని ముందుపెడతారన్న ఆసక్తి కనిపిస్తోంది. తండ్రి స్థానాన్ని భర్తీచేసేందుకు ఆయన కుమారులిద్దరూ సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా సీఎం సొంత జిల్లాలో నగరి టీడీపీకి అత్యంత కీలకం. అందుకే గాలి ముద్దుకృష్ణమ నాయుడు వారసుడు ఎవరనేదానిపై అన్ని లెక్కలూ వేసుకుంటోంది టీడీపీ నాయకత్వం. పైగా ఎమ్మెల్సీగా ముద్దుకృష్ణమ పదవీకాలం ఇంకా మూడున్నరేళ్లు ఉండటంతో ఉప ఎన్నిక కూడా అనివార్యం. దీంతో ఆ సీనియర్ లీడర్ బాధ్యతల్ని కుమారుల్లో ఒకరికిస్తారా..లేదంటే సీనియర్ లీడర్లలో ఎవరినన్నా రంగంలోకి దించుతారా అన్న చర్చ మొదలైంది.
ఎవరిని తెరపైకి తెచ్చినా గాలి ముద్దుకృష్ణమలేని లోటుని పూడ్చటం కష్టమేనన్నది చిత్తూరుజిల్లాలో జగద్విదితం. చివరికి వైసీపీ నేతలతోనూ గాలికి మంచి స్నేహబంధం ఉంది. ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసినప్పుడు గతంలో ఓడిపోయారన్న సానుభూతితోనే వైసీపీ ముఖ్య నాయకులు ఆయన ఏకగ్రీవానికి సహకరించారని చెబుతారు.
ఇన్ని సమీకరణాలతో ముడిపడి ఉండటంతో నగరిలో గాలి ముద్దుకృష్ణమ వారసులుగా తెరపైకి ఎవరొస్తారనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.

