ఫుటేజీ ఇస్తారా? చిక్కుల్లో ప‌డ‌తారా?

0
577

తెలంగాణ అసెంబ్లీలో అనూహ్య ప‌రిణామాల్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని కాంగ్రెస్‌ని తొక్కేద్దామ‌నుకున్న కేసీఆర్‌కి కోర్టు చిక్కులు త‌ప్పేలా లేవు. మండ‌లి ఛైర్మ‌న్ మీద హెడ్‌ఫోన్ విసిరి ఆయ‌న కంటికి గాయ‌మ‌య్యేలా చేశార‌నే అభియోగంతో ఏకంగా ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌భ్య‌త్వాల్ని ర‌ద్దుచేస్తూ తెలంగాణ అసెంబ్లీ నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సంప‌త్‌కుమార్ కోర్టుకెక్క‌టంతో స‌ర్కారు వ్యూహం బెడిసికొట్టేలా క‌నిపిస్తోంది.

కోమ‌టిరెడ్డి కేసులో స‌రిగా వాదించ‌లేక‌పోయార‌నీ, ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండానే వీడియో ఫుటేజీ స‌మ‌ర్పిస్తామ‌ని తొంద‌ర‌ప‌డి క‌మిట్ అయ్యార‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ప్ర‌కాశ్‌రెడ్డిపై స‌ర్కారు ఆగ్ర‌హించింది. ఆయ‌న‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తంచేసింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన ప్ర‌కాశ్‌రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌టంతో ఢిల్లీనుంచి హ‌రీష్‌సాల్వేని రంగంలోకి దించింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఆయ‌న రాక‌కు ముందే అసెంబ్లీ ప‌రిణామాల‌పై సీసీ ఫుటేజీని స‌మ‌ర్పించ‌డం సాధ్యంకాద‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు లాయ‌ర్ హైకోర్టుకు నివేదించారు. అయితే ఆ ప‌ప్పులేం ఉడ‌క‌వ‌ని కోర్టు తేల్చేసింది.

వీడియో ఫుటేజీని సమర్పించని పక్షంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఉమ్మడి హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంచేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరరావు ప్రభుత్వం తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం వచ్చిన ఏఏజీ జె.రామచంద్రరావు.. సభకు విచక్షణాధికారాలున్నాయని, నోటీసులిచ్చే పరిధి కోర్టుకు లేదని వాదించారు. వీడియో ఫుటేజీ సమర్పించాల‌ని అసెంబ్లీ తీర్మానించ‌లేద‌ని చెప్పారు.

ఇదే విషయమై మెమో దాఖలు చేయొచ్చని న్యాయమూర్తి చెప్పగా.. తాను అసెంబ్లీ తరఫున హాజరుకావడంలేదని ఏఏజీ చెప్పారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలని సూచనలు అందాయని, ఇందులో న్యాయశాఖ నామమాత్రపు ప్రతివాది మాత్రమేనని కోర్టు దృష్టికి తెచ్చారు. కౌంటరు దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇవ్వాలన్న ఏఏజీ అభ్య‌ర్థ‌న‌ను న్యాయమూర్తి నిరాకరించారు. ఇప్పటికే గడువు ఇచ్చామని, ఏప్రిల్‌ 3లోగా దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 3వ తేదీకి వాయిదా వేశారు.

సీసీ ఫుటేజీ స‌మ‌ర్పిస్తే త‌మ ఆరోప‌ణ‌ల తీవ్ర‌త త‌గ్గుతుందేమోన‌ని స‌ర్కారు వెనుకాడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. హెడ్‌ఫోన్ త‌గిలి స్వామిగౌడ్‌కి గాయం కాలేద‌ని, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం త‌ర్వాత కారుదాకా ఆయ‌నకు తోడున్నార‌ని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇదంతా స‌ర్కారు కుట్ర‌పూరితంగా ఆడిన డ్రామాగా విప‌క్ష‌పార్టీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. అసెంబ్లీ సీసీ ఫుటేజీలో అభియోగాల తీవ్ర‌త క‌నిపించ‌క‌పోతే కోర్టు నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌న్న‌దే ఇప్పుడు అస‌లు పాయింట్. అందుకే శాస‌న‌వ్య‌వ‌స్థ‌లో న్యాయ‌వ్య‌వ‌స్థ జోక్యం చేసుకోజాల‌ద‌న్న పాయింట్‌ని గ‌ట్టిగా ప‌ట్టుకుంది కేసీఆర్ స‌ర్కారు.