పాకాన‌ప‌డ్డ‌ పార్ల‌మెంట్ డ్రామా

0
528

ఢిల్లీ పెద్దల మంత్రాంగంలో భాగమో…మోడీషా మాస్టర్‌మైండ్‌ వ్యూహమోగానీ..హస్తిన సాక్షిగా పెద్ద డ్రామానే జరగబోతోంది. ఇన్ని రోజులూ వాయిదాలతో అవిశ్వాస తీర్మానాల్ని పక్కు నెడుతూ వచ్చిన బీజేపీ…చివరికిది జాతీయస్థాయిలో రచ్చయ్యేలా ఉండటంతో తప్పదన్నట్లు చర్చకు సిద్ధమైంది. మొన్నటిదాకా టీడీపీ, వైసీపీలే అవిశ్వాస నోటీసులిచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్‌, సీపీఎంతో పాటు ఇతర పార్టీలు జతకలవటంతో వాయిదాల పద్ధతి నడవదని బీజేపీకి అర్దమైంది. సభ ఆర్డర్‌లో లేదన తప్పించుకోవడం సాధ్యంకాదని తెలుసుకుంది. అందుకే అవిశ్వాస నోటీసులపై చర్చకు సిద్ధమవుతూనే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తన ఏర్పాట్లలో తానుంది.

లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉండీ.. అవిశ్వాసానికి భయపడుతోందనే అపవాదుని తప్పించుకునేందుకు తెరవెనుక ఎన్నో ఎత్తులేస్తోంది బీజేపీ. చర్చెలాగూ తప్పదు. కేంద్రంపై పోరాటంలో జాతీయస్థాయి దృష్టిని ఆకర్షించిన టీడీపీకి మైలేజీ రాకుండా చూసుకోవాలనుకుంటోంది టీడీపీ. అందుకే అవిశ్వాసానికే కాదు..ఏ అంశంమీదయినా చర్చకు సిద్ధమంటూ కొత్తగా రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఏపీ బ్యాక్‌గ్రౌండ్‌ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు ప్రకటన. అవిశ్వాసంపై మంగళవారం చర్చ జరగొచ్చని బీజేపీ నుంచి సంకేతాలురావడం, మమ్మల్ని అనవసరంగా బద్నాంచేస్తున్నారని బాధపడుతూ చర్చలో తామూ పాల్గొంటామని టీఆర్ఎస్ ప్రకటించడం ముందస్తు సన్నాహాల్లో భాగంలాగే ఉంది. ఎందుకంటే అవిశ్వాస చర్చలో పాల్గొంటామంటూనే తాము రిజర్వేషన్ల గురించి మాట్లాడాతామని టీఆర్ఎస్ అంటోంది.

టీడీపీ, వైసీపీలతో పాటు కాంగ్రెస్, సీపీఎం, ఆర్ఎస్‌పీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చాయి. వీటన్నింటినీ కలిపి చర్చకు అనుమతిస్తే ఒక్కోపార్టీ ఒక్కో అంశంపై మాట్లాడతాయి. దీంతో ఏపీకి కీలకమైన ప్రత్యేకహోదా ప్రధాన అంశం కాకుండా పోతుందనేది బీజేపీ మాస్టర్ ప్లాన్‌లా ఉంది. లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై నోటీసులు స్వీకరించిన తర్వాత అనుకుంటే వెంటనే చర్చ చేపట్టవచ్చు. ఎంతసేపు చర్చించాలనే దానిపైనా నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తానికి మంగళవారమే చర్చ ఖాయమయ్యేలా ఉంది. చర్చ పక్కకెళ్లిపోతే చేయడానికి రచ్చెలాగూ ఉంటుంది. వైసీపీకి మైలేజీ వెళ్లకుండా ఇప్పటిదాకా జాగ్రత్తపడ్డ టీడీపీ…పార్లమెంట్‌లో బీజేపీ ఎత్తుగడల్ని తిప్పికొట్టేందుకు ఎలాంటి అస్త్రాలు బయటికి తీస్తుందో మరి?