
అయ్యన్న అరెస్టుపై టీడీపీ నేతల నిరసన ర్యాలీ…
నవతరం, రావులపాలెం: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కాలరాస్తోందని, ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆరోపించారు.మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ ను అర్దరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రావులపాలెం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందించారు. అనంతరం నల్ల బాడ్జీలు ధరించి పురవీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సత్యానందరావు రాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముఖ లని, బిసి నేతల్ని అక్రమ కేసులు పెట్టి వారిని అణచివేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం చూస్తుందని బండారు ఆరోపించారు. గతంలోనూ ఇదేవిధంగా అనేకమంది బీసీ నేతలు అరెస్టు చేయడం జరిగిందని, అక్రమ కేసులకు, అరెస్టులకు తెలుగుదేశం పార్టీ నేతలు బయపదరన్నారు. రాజ్యాంగాన్ని లెక్క చేయడం లేదని, తానే సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమలు చేస్తున్నారన్నారు. ఈప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. ఇప్పటికైనా అప్రజాస్వామిక విధానాలు విటనాడాలని, కక్ష సాధింపు మానుకోవాలని నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామారావు,కంఠంశెట్టి శ్రీనివాస్, ధర్నాల రామకృష్ణ, నియోజకవర్గంలోని కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల పార్టీ నేతలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

