త‌ప్పు ఒప్పెలా అవుతుంది బాబుగారూ?

0
473

ఆవేశంతో స్టేట్మెంట్లు ఇచ్చేయ‌డం..త‌ర్వాత నాలుక క‌రుచుకోవ‌డం ఏపీ సీఎం చంద్ర‌బాబుకి అల‌వాటైపోయిన‌ట్లుంది. ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌లేమ‌ని కేంద్రం చెప్పిన‌ప్పుడు అసంతృప్తి వ్య‌క్తంచేసి ఏదోలా రాష్ట్రానికి న్యాయం చేయండని కోరి ఉంటే స‌రిపోయేది. కానీ దాన్నొక ముగిసిన అధ్యాయంగా భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్ర‌క‌టించిన ప్యాకేజీ ముందు హోదా దిగ‌దుడుపేన‌న్న‌ట్లు మాట్లాడారు. హోదా విష‌యంలో రాజీప‌డ్డార‌ని విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించ‌టంతో ఓ ద‌శ‌లో దాని గురించి మాట్లాడితే కేసులు పెడ‌తామ‌న్న‌ట్లు హెచ్చరిక‌లు చేశారు. ఇప్పుడేమో…మ‌ళ్లీ ఆయ‌న నోటే హోదా మాట వ‌స్తుంటే…పాత క్లిప్పింగులు బ‌య‌టికొస్తున్నాయి.

ప‌గ‌టి వేషాల‌తో ఏపీకి ఒరిగేదేంటి?

హోదా బ‌దులు ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీ ఎంత గొప్ప‌దో కేంద్రం చెప్పుకుని ఉంటే…రాష్ట్రంలో బీజేపీ నేత‌లు దాన్ని టాంటాం వేసుకుని ఉంటే అది వేరే సంగ‌తి. కానీ కేంద్రం త‌ర‌ఫున హోదా అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపించే బాధ్య‌త‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు భుజానికెత్తుకున్నారు. అధినేత రాగంతో అధికార‌ప‌క్ష‌నేత‌లంతా గొంతు క‌లిపారు. ప్యాకేజీ అద్భుతం, అమోఘ‌మ‌ని అన్నారు. ఇప్పుడేమైంది? ప్ర‌త్యేక‌హోదా అట‌కెక్కేసింది..ప్యాకేజీ కాస్తా ప‌క్క‌కెళ్లిపోయింది. చంద్ర‌బాబు మాట మారింది. న‌మ్మించి గొంతుకోశార‌న్న‌ట్లు మాట్లాడుతున్నారు ఏపీ సీఎం. హోదా కంటే మెరుగ్గా ఉంటుందంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామంటున్నారు. హోదా ఇవ్వాల్సిందేనంటూ మ‌ళ్లీ మొద‌టికొచ్చారు?

29 సార్లు తిరిగినందుకు చార్జీలూ దండ‌గేనా!

ప్ర‌త్యేక‌హోదా లేని లోటుని ఏ ప్యాకేజీ తీర్చ‌లేద‌ని చెప్పున్నా…క‌నీసం అంతా నెత్తినేసుకుని ఆవేశంతో ఊగిపోకుండా సైలెంట్‌గా ఉన్నా స‌రిపోయేది. అప్పుడేమో హోదా మాటెత్తితేనే క‌న్నెర్ర చేసి…ఇప్పుడు మళ్లీ అదే సంజీవిని అన్న‌ట్లు మాట్లాడితే జ‌నం న‌మ్ముతారా? స‌రే…జ‌నాన్ని ఎలాగోలా న‌మ్మించ‌గ‌ల‌మే అనుకుందాం. రాజ‌కీయ‌ప‌క్షాలు ఎందుకు ఊరుకుంటాయి. ఇది మీ గొంతే క‌దూ..అంటూ పాత ఆడియోలు వినిపిస్తాయి. వీడియోలు ప్లేచేసి చూపిస్తాయి. పేప‌ర్ క్లిప్పింగుల్ని ముందుపెడ‌తాయి. ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. అప్ప‌ట్లో హోదా అంటే జైలుకేన‌ని మీరే అన్నారుక‌దాని సోమువీర్రాజు అడుగుతుంటే టీడీపీ నేత‌ల‌కు మాట పెగ‌ల‌డంలేదు.

దీనికేమంటారు: సోమువీర్రాజు

ముఖ్యమంత్రే హోదా కావాలని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరు జైలుకెళ్లాలి? సీఎంకు ఏ చట్టం వర్తిస్తుంది’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వీరంగ‌మేస్తున్నారు. గతంలో మాట్లాడిన దానికి, ఇప్పుడు మాట్లాడుతున్న దానికి పొంత‌న‌లేక‌పోతే ఎలాగ‌ని మాట‌ల‌తో వాత‌లు పెడుతున్నారు. హోదా బదులు ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం మరచిపోయారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇంతకంటే కేంద్రాన్ని ఎక్కువ అడగలేమని అప్పట్లో కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్న మాట‌ల్ని గుర్తుచేస్తున్నారు. అప్ప‌ట్లో అలా మాట్లాడాల్సి వ‌చ్చింద‌ని చెబుతారా? తొంద‌ర‌ప‌డ్డామంటారా? అలా అన్లేద‌ని బుకాయిస్తారా? అప్పుడ‌లా అనుకున్నా..కానీ ఇప్పుడిలా అయ్యింద‌ని అడ్డం తిరుక్కుంటారా? అడుసు తొక్క‌నేల? కాలు క‌డ‌గ‌నేల‌?