ఆడియో ఫంక్షన్ రేంజ్‌లో అన్న ప్రజారాజ్యం పార్టీని ఎనౌన్స్ చేసిస మూడేళ్లు తిరక్కముందే జెండాని మడిచేసి కాంగ్రెస్ చేతిలో పెట్టేశాడు. అన్న అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్న తమ్ముడు పక్కా ప్లాన్‌తో జనసేనని నడిపిస్తారనుకుంటే ఆ లక్షణాలేం కనిపిస్తున్నట్లు లేదు. ఎప్పుడో 2014 ఎన్నికలకు ముందు పెట్టిన జనసేన పార్టీ ఇప్పటికీ సంస్థాగతంగా బలపడింది లేదు. అంతా నాయకులే, అంతా కార్యకర్తలే అన్నట్లుంది వాతావరణం. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీచేయాలంటే ఉన్నది ఇంకో ఏడాది సమయమే. రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తేగానీ పార్టీ సంస్థాగత నిర్మాణం సాధ్యంకాదు. అయితే పవర్‌స్టార్ పార్టీకి అసలుకంటే కొసరు ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది.
బడ్జెట్‌లోనూ ఏపీకి కేంద్రం మొండిచేయి చూపగానే పవన్‌కళ్యాణ్ దీనిపై గళమెత్తుతారని అనుకున్నారు. ఏపీ ఎంపీల ఆందోళనకు వెంటనే ప్రతిస్పందిస్తారనుకున్నారు. ఇక పూర్తి సమయం రాజకీయాలకేనని ఆమధ్య ప్రకటించిన పవన్ కళ్యాణ్ దినపత్రికలా స్పందించాల్సింది పోయి వీక్లీలా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడాయనో కొత్త బాధ్యత నెత్తినేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడేందుకు జేఏసీ ఏర్పాటు బాధ్యతని భుజానికెత్తుకున్నారు. దీనికోసం జేపీని కలిశారు. ఉండవల్లిని పిలిచారు. జేఏసీకి ఓ రూపం ఎప్పుడొస్తుందో, అదెప్పుడు పోరాటం ప్రారంభిస్తుందో తర్వాతి సంగతి. ప్రస్తుతానికైతే జనసేనానికి జేఏసీనే టాప్ ప్రయారిటీ.
తప్పేంలేదు. రాష్ట్రంకోసం పోరాడేందుకు జేఏసీ ఏర్పాటుచేయాలన్న ఆలోచన మంచిదే. అందులో పవన్‌కళ్యాణ్‌లాంటి క్రేజీ హీరో ముందు నిలిస్తే పోరాటం బాగా హైలెట్ అవుతుంది. అంతా కలిసొస్తారు కూడా. కానీ జనసేన పరిస్థితి ఏంటన్నదే ఇప్పటికే దాన్ని నమ్ముకున్న నాయకులకు మింగుడుపడని విషయం. అధికార, ప్రతిపక్షపార్టీల్లో ఇమడలేని నాయకులెందరికో జనసేన ఆశాకిరణంలా కనిపించింది. పైగా ఎన్నికలు రెండుమూడు నెలల ముందే ..అంటే ఈ ఏడాది చివరికల్లా జరగొచ్చనే అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతీ నిమిషం పార్టీ నిర్మాణంపైనే దృష్టిపెట్టాల్సిన పవన్‌కళ్యాణ్ ఇలా డైవర్ట్ అయితే జనసేన మరో ప్రజారాజ్యంలా మిగిలిపోతుందనే భయంలోనూ అర్ధముంది.

