- సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో బిఎస్పి పోటి
- త్వరలో బిసి రిజర్వేషన్ల పెంపుకొరకు మహోద్యమం
- డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ
తంగళ్ళపల్లి బైపాస్ / సిరిసిల్ల, నవంబర్ 17 (నవతరం): త్వరలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరగబోయే సెస్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీచేయనుందని డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ రోజు సిరిసిల్ల కేంద్రంలో లహరి ఫంక్షన్ హాల్ లో జరిగిన బిఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సిరిసిల్ల సెస్ ఎన్నికలలో బిఎస్పి పార్టీ యొక్క కార్యాచరణ ఎలా ఉండనుందో చర్చించుకుని త్వరలో పూర్తి వివరాలు తెలుపుతామన్నారు. 1970లో ప్రారంభమైన సెస్ సహకార సంఘంను పూర్తి స్థాయిలో మెరుగ్గా అభివృద్ది చేయడానికే పోటీ చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బిసిల కులగణన చేయకుండా మోసం చేసిందన్నారు. బిసి జనాభా 50 శాతం పైగా ఉంటే కేవలం 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే కల్పిస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. అందుకు బిసిల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు కోసం పెద్దఎత్తున బిఎస్పి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని వెల్లడించారు. బిసిల జనగణన చేయకుంటే బిజెపిని గ్రామాల్లోకి రానివ్వద్దని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బిసిలను అన్ని రంగాల్లో మోసం చేస్తుందని విమర్శించారు. కులాల వారిగా జనాభా లెక్కించి, ఎవరి వాటా వారికి అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని దాదాపుగా మూడు వేల మంది ట్రాన్స్ కో ఉద్యోగులకు ప్రభుత్వం రివర్షన్ ఇవ్వడాన్ని ఖండించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 52 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను, ఆంధ్ర ప్రాంతంలో పనిచేసిన ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వడం కోసం స్థానిక ఉద్యోగులకు రివర్షన్ ఇవ్వడం వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిఎస్పి పార్టీ ఉద్యోగుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. సిరిసిల్లలో బిఎస్పి కార్యకర్తలను కెటిఆర్ అనుచరులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బిఎస్పి అభివృద్దిని జీర్ణించుకోలేకనే భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, బిఎస్పిని అడ్డుకోవాలని చూస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని హెచ్చరించారు. సిరిసిల్లలో గుండారాజ్యం కొనసాగుతుందని ఆరోపించారు. సెస్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అంకాని భాను, సిరిసిల్ల జిల్లా నాయకులు స్వామిగౌడ్, లింగంపల్లి మధుకర్, జంగం నరేష్, కుంట శ్రీనివాస్, చంద్రునాయక్, అబ్దుల్ నబీ, గజ్జెల అశోక్, తదితరులు పాల్గొన్నారు.







