కిడ్నీ వ్యాధితో మరణించిన కామ్రేడ్ నర్తు సీతారామ్..

0
61

నవతరం, శ్రీకాకుళం: కిడ్నీ వ్యాధితో మరణించిన కామ్రేడ్ నర్తు సీతారామ్ కి నివాళులు వైఎస్ఆర్సిపి నేతలు (మందస) జనశక్తి పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం సభ్యుడైన కామ్రేడ్ నర్తు సీతారాం (50) బుధవారం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఆకస్మికంగా మరణించారు. కామ్రేడ్ నర్తు సీతారాం అకాల మృతితో ఉద్దానం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మందస మండలం లోహర్ బంధ గ్రామపంచాయతీ గొల్లపాలెం గ్రామానికి చెందిన ఆయన ఉద్దానం విప్లవ ఉద్యమ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 2018లో ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యు.డి.ఎఫ్ చేసిన ప్రజా ఉద్యమంలో కామ్రేడ్ నర్తు సీతారాం క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన అకాల మృతి పట్ల బాలిగం పిఎసిఎస్ పూర్వ అధ్యక్షులు, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు సొర్ర ఢిల్లీ శ్వరరావు, వైయస్సార్ ఉద్యాన వర్సిటీ పాలకమండలి మాజీ సభ్యులు బత్తిన లక్ష్మణ్ గురువారం గొల్లపాలెంలో ఆయన కుటుంబ సభ్యులకు వెళ్లి తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా బత్తిన లక్ష్మణ్ మాట్లాడుతూ, దివంగత కామ్రేడ్ నర్తు సీతారాం ఉద్దానం ప్రాంతంలో వివిధ సమస్యలపై రాజీలేని పోరాటాన్ని కొనసాగించారని, వంశధార సాగు నీటిని రైతులకు అందించాలని, జంతి బండ గడ్డ రిజర్వాయర్ కట్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే జీడిపిక్క రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ ప్రజా ఉద్యమ పోరాటాలు ఆయన కొనసాగించారని లక్ష్మణ్ గుర్తు చేశారు. సిపిఎంఎల్ లిబరేషన్ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తామాడ సన్యాసిరావు మాట్లాడుతూ, చిన్నతనం నుంచి ప్రజా ఉద్యమాల్లోకి ఆకర్షితుడై జనశక్తి పార్టీలో చేరి రైతు ఉద్యమాలను ఉదృతం చేసే దిశగా సీతారాం అడుగులు వేశారని పేర్కొన్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు ఉండిపోయారని సన్యాసిరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మద్దిలి రామారావు, జనశక్తి సభ్యులు కోనేరు రమేష్, గుంటు రామస్వామి, వైసిపి యువజన నేత దున్న హరికృష్ణ, పులారి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here