కార్తీక్‌..నూ సూప‌ర్‌..

0
519

దశాబ్దాల కిందట భారత్‌తో మ్యాచ్‌లో చివరి బంతికి మియాందాద్‌ సిక్సర్ కొట్టి పాకిస్థాన్‌ను గెలిపించిన వైనాన్ని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. మ‌న టీమిండియాకు కూడా అలాగే గొప్ప‌గా చెప్పుకోవ‌డానికో ఉదాహరణ దొరికింది. క‌ల‌కాలం గుర్తుండిపోయే ఈ అద్భుత ఫీట్‌ని ప్ర‌ద‌ర్శించాడు దినేశ్‌ కార్తీక్‌. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో దినేశ్‌ కార్తీక్‌ క్రికెట్‌ చరిత్రలో తన పేరు నిలిచిపోయేలా చేసుకున్నాడు.
కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులు కొట్టి టీమిండియాకు మ‌ర‌పురాని విజయాన్నందించాడు దినేశ్‌కార్తీక్‌. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 6 వికెట్లు కోల్పోయి చివరి బంతికి గెలుపువాకిట్లో నిలిచింది.

17 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 132 ప‌రుగులే చేసిన భార‌త్‌ని కార్తీక్ ఆదుకున్నాడు. 3 ఓవర్లలో 35 పరుగులు చేయాల్సి ఉండగా.. విజయావకాశాలు సమానంగా కనిపించాయి. చివరి మూడు ఓవర్లలో మాత్రం ఆట‌ అనూహ్య మలుపులు తిరిగింది. వ‌ర‌స‌గా నాలుగుబంతులు వృథా అయ్యాక ఐదో బంతికి సింగిల్ మాత్ర‌మే తీసి..ఆరో బంతికి వికెట్ కోల్పోయింది భార‌త్‌. మ్యాచ్ ముగిసిన‌ట్లేన‌నుకున్న స‌మ‌యంలో క్రీజ్‌లోకొచ్చిన దినేశ్‌కార్తీక్ గేమ్‌ని మార్చిపారేశాడు.
మూడు బంతుల్లోనే 16 పరుగులు సాధించిన కార్తీక్ నాలుగో బంతిని ఆడ‌లేక‌పోయినా ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. చివరి బాల్‌ని క‌ళ్లు బైర్లు క‌మ్మే షాట్‌తో బౌండ‌రీలైన్ దాటించాడు. ఒకే ఓవ‌ర్‌లో 22 పరుగుల‌తో చివ‌రి ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కార్తీక్ మ్యాజిక్ చేశాడు.
2 బంతుల్లో 5 ర‌న్స్ చేయాల్సిన స‌మ‌యంలో కార్తీక్‌కి తోడుగా ఉన్న‌ శంక‌ర్ ఐదో బంతికి ఔట్‌కావ‌టంతో భార‌త జ‌ట్టు ఆశ‌లొదిలేసుకుంది. ఒక్క బంతిలో 5 పరుగులు అసాధ్య‌మ‌నుకుంటున్న స‌మ‌యంలో సిక్స‌ర్‌తో అద్భుత‌మైన విజ‌యాన్ని అందించాడు దినేశ్ కార్తీక్‌.