
నవతరం: పెనుమంట్ర మండలం జుత్తిగ, పాలమూరు గ్రామాల్లో శనివారం జగనన్న ఇళ్ల నిర్మాణ కాలనీల పనులను సబ్ కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నిర్మాణ పనులకు అనుకూలమైన సమయమని, ఇటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులు ఇళ్ల నిర్మాణం పనులు, కాలనీలలో మౌలిక సదుపాయాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచిత ఇసుకతో పాటు సబ్సిడీ పై సిమెంట్, ఐరన్ వంటి నిర్మాణ సామగ్రిని అందిస్తోందని, ఈ విషయంపై లబ్ధిదారులను చైతన్యపరచి ఇళ్ల నిర్మాణం పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. కాలనీలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులను కలిసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా నిర్మాణ పనులలో అధికారులు అందిస్తున్న సేవలను గురించి లబ్ధిదారులను ఆరా తీశారు. జగనన్న ఇళ్ల నిర్మాణం, 90 రోజులలో ఇళ్ల స్థలాల మంజూరు కార్యక్రమంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇళ్ల స్థలాలకు అందిన ధరఖాస్తులను వెంటనే ఆన్లైన్ లో రిజిస్టర్ చేయాలన్నారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణకు ప్రభుత్వ భూములకు ప్రాధాన్యత ఇవ్వాలని సబ్ కలెక్టరు సూచించారు. సబ్ కలెక్టరు వెంట తహశీల్దార్ డి వి ఎస్ ఎస్ అశోక్ వర్మ, ఎంపీడీవో డి.రాంబాబు, విఆర్వో, గ్రామ కార్యదర్శి, మండల సర్వేయర్, తదితరులు పాల్గొన్నారు.

