
నవతరం, శ్రీకాకుళం: మాజీమంత్రి అంబటి రాంబాబు పై జరిగిన దాడిని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతి నాయుడు పత్రిక ప్రకటన లో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకొని దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు శివారులోని గోరంట్లలో పోలీసుల సమక్షంలోనే కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేసి ప్రస్తుతం జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని తిరుపతి నాయుడు విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై లేనిపోని అసత్య ఆరోపణలు చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ప్రభుత్వం ఇప్పుడు నిలదీస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై భౌతిక దాడులకు దిగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో హోం మంత్రి విఫలమయ్యారని విమర్శించారు. దాడికి పాల్పడిన టీడీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అధికారులపై డి ఒ పి టి కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

