
నూతన సంవత్సర వేడుకలకు “దువ్వాడ ” శిబిరం సర్వం సిద్ధం వందలాది మందికి అల్పాహారం ఏర్పాట్లు ( పలాస) నూతన సంవత్సరం సందర్భంగా ప్రముఖ న్యాయవాది, పలాస జిల్లా కేంద్ర సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ (బాబా) నివాసం న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. వేదిక ప్రాంగణం సందడితో కళకళలాడనుంది. పలాస నియోజకవర్గం నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాటు చేయడంతో పాటు వందలాది మందికి అల్పాహారం సౌకర్యం కల్పించనున్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని దువ్వాడ శ్రీధర్ (బాబా) ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కొత్త ఏడాదిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, 2026 లో ప్రతి ఒక్కరికి ఆ షిరిడి సాయిబాబా అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలాషించారు. ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు , అవకాశాలు, సరికొత్త ఆనందాలతో, పాడి పంటలు సమృద్ధిగా పండి, తద్వారా అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. పలాస నియోజకవర్గ ప్రజలకు దువ్వాడ శ్రీధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే ఏడాదిలోనైనా పలాసను జిల్లా కేంద్రం చేయాలని, అందుకు ప్రజా గొంతుగా పోరాట ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి అన్ని వర్గాల ప్రజలు, రాజకీయాలకు అతీతంగా వివిధ స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులు, యువత, మహిళలు పలాస జిల్లా కేంద్రాన్ని ప్రభుత్వం ప్రకటించే వరకు సంపూర్ణ మద్దతునివ్వాలని దువ్వాడ శ్రీధర్ (బాబా) కోరారు.

