జగద్గిరిగుట్టలో అక్రమనిర్మాణాలు

0
123

శ్రీనివాస్ నగర్ రోడ్ నంబర్ 7 లో, రోడ్డును ఆక్రమించిన నిర్మాణదారుడు

నిద్రమత్తులో గాజులరామారం టౌన్ ప్లానింగ్ అధికారులు

జగద్గిరిగుట్ట / కుత్బుల్లాపూర్ (నవతరం): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట శ్రీనివాస్ నగర్లో రోజురోజుకు అక్రమనిర్మాణాలు పేరుకుపోతున్నాయి. అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలు ఒక వైపయితే.. సెట్ బ్యాక్ లు లేకుండా, రోడ్లను ఆక్రమిస్తూ ఇండ్ల నిర్మాణాలు చేపడుతూ స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులకు సవాలుగా మారుతున్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ లోని పలు కాలనీలు ఇప్పటికే ఇరుకైన రోడ్లతో కనీసం బైకులు, కార్లు, ఇతర వాహనాలు వెళ్ళడానికి వీలులేకుండా ఉన్నా, తిరిగి అదే తంతు కొనసాగిస్తూ రోడ్లను ఆక్రమిస్తూ, అయిదు ఫీట్లు ముందుకు జరుగుతూ పిల్లర్లను వేస్తూ ఇష్టానుసారంగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై స్థానికంగా వున్న కొందరు వ్యక్తులు గాజులరామారం టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయమై పలుమార్లు సంబంధిత అధికారులను ప్రశ్నించగా నోటీసులు జారీ చేస్తున్నాం, డిమాలిషన్ టీం చర్యలు తీసుకుంటుందంటూ తాపీగా సమాధానాలు చెబుతూ, అందినకాడికి వసూలు చేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. శ్రీనివాస్ నగర్ రోడ్డు నంబర్ 7 లో జరుగుతున్న ఇంటి నిర్మాణదారుడు ఏకంగా అయిదు ఫీట్లు రోడ్డును ఆక్రమించి పిల్లర్లు వేశాడు. పిల్లర్లే అయిదు ఫీట్లు జరిపాడంటే, పైన ఫ్లోర్ ఎన్ని ఫీట్లు జరుగుతాడు అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జీరో పర్మిషన్లతో ఇండ్ల నిర్మాణాలు చేపడుతూ, రోడ్లను ఆక్రమిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటారా, లేదా వేచి చూడాలి.