- నిద్రమత్తులో గాజులరామారం టౌన్ ప్లానింగ్ అధికారులు
- ఫిర్యాదులు చేసినా స్పందించని వైనం
- స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉందంటూ దాటవేసే ప్రయత్నం
- అందినకాడికి దండుకుంటూ విధులను మర్చిపోతున్న అవినీతి అధికారులు
- టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారా, లేరా అనే అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు
గాజులరామారం, నవంబర్ 11 (నవతరం): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాజులరామారం సర్కిల్ లో టౌన్ ప్లానింగ్ అధికారులు పనిచేయడమే మానేశారు. హాజరుపడితే చాలు, వేతనం వస్తే చాలన్నట్టు ఉంది వారి వ్యవహారం. దీనికి తోడు అనుమతుల్లేని భవన నిర్మాణదారులు వద్దన్నా తీసుకువచ్చి తెచ్చిచ్చే ముడుపులు. ఇంకేముంది ఇది సరిపోతుంది కదా అంటూ ఇక్కడి జనం గాజులరామారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై సెటైర్లు వేసుకుంటున్నారు. అవును.. ఒక్కోసారి ఇది నిజమే అనిపిస్తుంది. గాజులరామారం సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట, మహాదేవపురం, కైలాష్ హిల్స్, ద్వారకానగర్ ఫేజ్ – 2, మహాదేవపురం సొసైటీ కాలనీ, బాలాజీ లేఔట్, దేవేందర్ నగర్, తదితర ప్రాంతాల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలే నిదర్శనం. ఇప్పటికే అనుమతుల్లేని బహుళ అంతస్తుల నిర్మాణాలతో గాజులరామారం సర్కిల్ ఎవరికీ అర్థం కాకుండా తయారవుతుంటే ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వాటికి ఆజ్యం పోస్తున్నారు. ఇందుకు పూర్తి నిదర్శనం జగద్గిరిగుట్ట డివిజన్ అవుట్ పోస్ట్ వద్ద గల రిషి వైన్స్ కు ఎదురుగా వున్న సెల్లార్ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతుల్లేకున్నా, అట్టి నిర్మాణం పై ఎందరో రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా.. కేవలం నోటీసుల పేరుతో కాలాయాపన చేసి అక్రమ నిర్మాణదారుడికి కొమ్ము కాశారు ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇక్కడి సోమయ్య నగర్ లో అయితే బహుళ అంతస్తుల నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేనే లేదు. శ్రీనివాస్ నగర్లో రోడ్లను సైతం కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతుంటే, తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరించిన టౌన్ ప్లానింగ్ అధికారుల మొఖాలపై ఉమ్మేస్తున్నారు స్థానిక ప్రజలు. ఇక్కడా అక్కడా అని చెప్పాల్సిన అవసరం లేదు.. పూర్తి సర్కిల్ లో అనుమతుల్లేని బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దేవేందర్ నగర్, కైసర్ నగర్, మహాదేవపురం సొసైటీ, కైలాష్ హిల్స్ ప్రాంతాల్లో ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు, అనుమతుల్లేని భారీ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నా ‘కండ్లుండి చూడలేని కబోదుల్లా’ తయారయ్యారు ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులు. అదనపు అంతస్థులకు, ఒక్కో శ్లాబ్ కు ఇంత అంటూ బేరం కుదుర్చుకుని లక్షల్లో దండుకుంటూ, కనీసం ఫిర్యాదులకు స్పందించకుండా తమ విధులను సైతం మర్చిపోతున్న ఇక్కడి టౌన్ ప్లానింగ్ అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టి, వీరి అవినీతి బట్టబయలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అవినీతిలో కూరుకుపోయిన చైన్ మెన్ స్థాయి అధికారి నుండి కమిషనర్ల వరకు, ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తమ అవినీతి సామ్రాజ్యానికి అవధులు లేకుండా పోతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేవేందర్ నగర్లో వెలసిన భారీ ఆక్రమ షెడ్డు 
డబుల్ బెడ్రూం ఇండ్ల పక్కనే వెలసిన అనుమతుల్లేని షెడ్డు నిర్మాణం 
మహాదేవపురం సొసైటీ, బాలయ్య నగర్ కమాన్ లోపల ఎడమవైపున వెలసిన అక్రమ నిర్మాణం 
గాజులరామారం సర్కిల్, ద్వారక నగర్ ఫేజ్ – 2, రోడ్ నంబర్ 4 లో సెట్ బ్యాక్ లు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణం

