
ఓటరు దినోత్సవం
ఎప్పుడు.. ఎప్పుడు ఈ దేశం.. ఈ జాతి బాగుపడేదెప్పుడు.. నిజాయితీగా ఓటేయగలిగినప్పుడు..!
నవతరం, విజయనగరం: కులం పిచ్చితో.. మతం మాయలో.. పార్టీల గారడీలో పడిపోక మనిషిని చూసి.. అతడి గుణగణాలను ఎంచి ఓటేయగలిగినప్పుడు..!
నోటుకు ఓటు అమ్మక మందుకు చిందుకు విందుకు లొంగిపోక.. నిఖార్సైన అభ్యర్థిని కనుగొని నిబద్ధంగా ఓటేయగలిగినప్పుడు..!
బూటకపు వాగ్దానాలు ఆచరణ సాధ్యం కాని హామీలు అబద్దాలతోనే బ్రతికే బినామీలు మాయమాటల సునామీల దరిచేరనీయక….మంచి నేతను పోల్చి…..అతడికే…ఓటేయగలిగినప్పుడు..!
కాసులు..కేసులు….. తిరకాసులు.. కక్షలు… జైలుశిక్షలు.. ఎన్నున్నా…. ఎంచక…. … తుంచక.. కోపగించక….. అసహ్యించక అతడినే నెత్తిన పెట్టుకునే వెర్రితనాన్ని వదిలి….. నిజాయితీకే పట్టంకట్టే విజ్ఞతతో ఓటేయగలిగినప్పుడు..!
ఫలానా నాయకుడి కొడుకని.. అల్లుడని..మనవడని…. మనవాడని నమ్మి భ్రమించక అభ్యర్థి చరితను.. నడవడిని.. ఒరవడిని చూసి ఓటేయగలిగినప్పుడు..!
లక్షలు గాక లక్షణాలు చూసి చాలా మంది బలం గాక బుద్ధిబలం గమనించి వెనక గుండాలు గాక మంచి గుండె ఉందోలేదో ఆరా తీసిఓటేయగలిగినప్పుడు..!
చివరగా.. నువ్వు నువ్వుగా… మంచిమనిషిగా…. ఉత్తమ పౌరుడుగా…. బాధ్యత గల ఓటరుగా… నిలబడి గర్వంగా నీ హక్కును వినియోగించగలిగినప్పుడు..! ఈ రౌడీల.. దగాకోరుల.. నయవంచకుల.. నేరచరితుల… వారసుల.. కంసుల.. అసురుల.. బకాసురుల.. కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యానికి విముక్తి.. దేశానికి ముక్తి.. నీకు మరోసారిదాస్యవిముక్తి..!
నిన్ను ఉద్ధరించడానికి ఎవరో రారు.. నీ తరపున పోరాడరు.. ఈసారి నువ్వే గాంధీవి.. నువ్వే నేతాజీవి.. తిరగబడితేనే చరిత్రను తిరగరాయగలుగుతావు…..!..

