మాన‌వ మ‌తం..మ‌నిషి కులం!

0
565

ఏ మ‌తం? ఏ కులం? మ‌నోడా..ఏరే కుల‌పోడా? ఎన్నో భాష‌లు, కులాలు, తెగ‌లు, సంస్కృతీ సంప్ర‌దాయాలున్న ఈ దేశంలో కుల‌గ‌జ్జి ఇప్ప‌టిది కాకున్నా…మ‌తం ప్రాతిప‌దిక‌న స‌మాజాన్ని చీల్చే కుట్ర‌ల రాజ‌కీయానికి మాత్రం తెర‌లేచింది బీజేపీ పాల‌న‌లోనే. మ‌తం క‌ల‌రా కంటే ప్ర‌మాదం. క్యాన్స‌ర్ కంటే ప్రాణాంత‌కం. అది త‌ల‌కెక్కితే మ‌నుషులం అనే విచ‌క్ష‌ణ ఉండ‌దు. రెండుకాళ్ల జంతువుల్లా మారిపోతాం. ఉన్మాదంతో ఊగిపోతాం. ఎవ‌రో ఒక‌రు..ఎప్పుడో అప్పుడు ఈ కులం గోడ‌లు బ‌ద్ద‌లు కొట్ట‌క‌పోతే…మ‌తం సృష్టిస్తున్న అగాధాన్ని పూడ్చ‌కపోతే ప్ర‌జాస్వామిక ల‌క్ష్యానికే పెను ప్ర‌మాదం.

మ‌తం, కులంతో ప‌నేముందంటూ విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు కేర‌ళ విద్యార్థులు. కూడ‌బ‌లుక్కున్న‌ట్లు, ఈ దేశానికే ఓ సందేశం ఇవ్వాల‌నే ల‌క్ష్యంతో క‌దులుతున్న‌ట్లు ఏకంగా ల‌క్ష‌న్న‌ర‌మందికి పైగా రేప‌టి పౌరులు కులాన్ని ఛీకొట్టారు. మ‌తంపై కాండ్రించి ఉమ్మారు. స్కూల్‌ అడ్మిషన్ల అప్లికేషన్లలో కులం, మతం గురించి ఏమీ రాయకుండా… భారీసంఖ్య‌లో విద్యార్థులు కేర‌ళ‌లో ద‌ర‌ఖాస్తు చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వచ్చిన లక్షకు పైగా ద‌ర‌ఖాస్తుల్లో కులం ఏద‌నే కాల‌మ్ ఖాళీగా వ‌దిలేశారు. చ‌దువుకోసం మ‌త ప్ర‌స్తావ‌న ఎందుక‌ని దాన్ని ప‌ట్టించుకోలేదు.

కేరళలో కొన్నేళ్లుగా చాప‌కింద నీరులా సాగుతోంది క్యాస్ట్ నో.. రిలీజియన్‌ ఉద్యమం. ఏటా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చేరే విద్యార్థులు అప్లికేషన్లలో కులం, మతం కాలమ్స్‌ని ఖాళీగా వదిలేస్తున్నారు. తమ కులం, మతం గురించి చెప్పుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది అడ్మిష‌న్ల‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో లక్షా 24వేలమంది తమ కుల, మతాల గురించి ప్ర‌స్తావించ‌లేద‌న్న విష‌యాన్ని కేరళ విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ రవీంద్రనాధ్ అసెంబ్లీకి తెలిపారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే మూడులక్షలమందికి పైగా ఇలా ప్ర‌తిస్పందించార‌ని చెబుతున్నారు.

కేరళలో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తోంది. కులం, మతం ప్ర‌స్తావ‌న‌తో విద్యార్థుల మనసుల్లో చిన్నతనంలోనే విషబీజాలు నాటుతున్నారనే అభిప్రాయం ఉంది. ఈ వాదనకు క్ర‌మేణా మ‌ద్ద‌తు పెరుగుతోంది. మ‌త‌మేదో క‌నుక్కుని ఇళ్ల గోడ‌ల‌మీద గుర్తులేస్తున్న విష‌సంస్కృతి ఓ వైపు ఉత్త‌రాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌బ‌లుతోంది. ఆహార్యాన్ని బ‌ట్టి అకార‌ణ విద్వేషం పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఈ దేశానికే ఓ గొప్ప పాఠం చెబుతోంది కేర‌ళ విద్యార్థిలోకం.