మిస్ట‌ర్‌కూల్‌ని కూడా కెలికేసింది!

0
481

వార్త‌ల్లో ఉండాలంటే..ప‌దిమందీ త‌న గురించి చ‌ర్చించుకోవాలంటే ఏదో ఒక సంచ‌ల‌నంలో క‌నిపించాలి. లేదంటే ఆ సంచ‌ల‌నం తానే కావాలి. బుల్లితెర‌నుంచి వెండితెర‌దాకా అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ చేసినా..చివ‌రికి వ్ర‌తంచెడ్డా ఫ‌లితం ద‌క్క‌ని శ్రీరెడ్డి ఇప్పుడ‌దే ప‌న్లో ఉంది. ఆ మ‌ధ్య ముగ్గురు వ‌ర్ధ‌మాన హీరోల గురించి లీకులిచ్చింది. ఓ ద‌ర్శ‌కుడిపైనా ఆరోప‌ణ‌లు చేసింది. ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు కావాలంటే హీరోయిన్లు పాతివ్ర‌త్యాన్ని పెట్టుబ‌డిగా పెట్టాల్సిందేన‌ని ఇంట‌ర్వ్యూల్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అప్ప‌ట్నించీ కాస్తంత వార్త‌ల్లో క‌నిపించేస‌రికి ఇంకాస్త మ‌సాలా ద‌ట్టిద్దామ‌నేమో..శేఖ‌ర్ క‌మ్ముల‌ని వివాదంలోకి లాగింది.

ఇండ‌స్ట్రీలో శేఖ‌ర్ క‌మ్ముల‌కి మిస్ట‌ర్ కూల్ అనే పేరుంది. త‌నేంటో…త‌న సిన్మా ఏంటో..అంత‌వ‌ర‌కే! మిగిలిన‌వేమీ ఆయ‌న ప‌ట్టించుకోడు. ఆయ‌న‌తో ప‌నిచేసేందుకు అంతా ఇష్ట‌ప‌డేది అందుకే. అలాంటి ద‌ర్శ‌కుడ్ని కూడా ట్విట‌ర్‌లో ప‌రోక్షంగా ప‌రువుతీసేలా వ్యాఖ్య‌లు చేసింది శ్రీరెడ్డి. తెలుగు అమ్మాయిలు ప‌క్క‌లోకి త‌ప్ప ఎందుకూ ప‌నికిరార‌ని అత‌ని న‌మ్మ‌కం అంటూ ఎద్దేవా చేసిన శ్రీరెడ్డి..కొమ్ములొచ్చిన శేఖ‌ర్ అనీ..బ‌క్క‌ప‌ల‌చ‌ని డైరెక్ట‌ర్ అనీ తానెవ‌రిని టార్గెట్ చేసిందో చెప్ప‌క‌నే చెప్పింది. దీంతో దీనిపై టాలీవుడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల సీరియ‌స్‌గా స్పందించారు. అది పోస్ట్ చేసిన వాళ్లు క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు.

‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను అభిమానించేవారికి తీవ్ర మ‌న‌స్తాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు ఎప్పుడూ చూడనే చూడని, కనీసం ఫోన్లో కూడా ఏనాడూ మాట్లాడని అమ్మాయి , నా గురించి నిరాధార ఆరోపణలు చేయటం షాకింగ్‌గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమ‌వుతుంది. వ్యక్తిత్వం, విలువలు నాకు ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు.’