బరితెగించిన కబ్జాదారులు

0
32
  • అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సర్పంచ్
  • సహకరిస్తున్న కొందరు వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి
  • చర్యలు తీసుకోవాలంటున్న స్థానిక ప్రజలు

జిన్నారం/సంగారెడ్డి, డిసెంబర్  6(నవతరం): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని ఖాజీపల్లి సర్వే నంబర్ 181 లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి, ప్లాట్లుగా మార్చి, ఆ ఖాళీ ప్లాట్ లకు నకిలీ పట్టాలు సృష్టించి వాటిని అమ్ముకుంటూ, ఆ నకిలీ పట్టాలకు తోడుగా మూడు, నాలుగు లింకు డాకుమెంట్లు తయారు చేసి, లక్షల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కబ్జాదారులు. గతంలో ఈ కాలనీకి సుమారు అయిదు వందల పదిహేను పట్టాలు మంజూరయ్యాయి. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నకిలీ పట్టాలు సృష్టించారు. వీటిని అడ్డు పెట్టుకుని అమాయక ప్రజలకు కట్టబెడుతూ.. ఒక్కో ప్లాట్ ను లక్షల్లో అమ్ముకుంటూ లక్షలు దండుకుంటున్నారు. ఒక్కొక్క ప్లాట్ ను నలుగురికి అమ్ముకుంటూ, వివాదాలు సృష్టిస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ కూడా లక్షల్లో డబ్బులు దండుకుంటూ ఎంతో మందికి సున్నం పూశారు. కొందరు అవినీతి అధికారులను అడ్డం పెట్టుకుని భూకబ్జాలకు పాల్పడుతున్నారు కొందరు స్థానికంగా ఉండే ఛోటా, గల్లీ లీడర్లు. గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడి భూకబ్జా కథలపై స్పందించిన రెవెన్యూ అధికారులు రెవెన్యూ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ అక్రమ నిర్మాణాలను నిలువరించలేకపోయారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన భూకబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ, ప్రభుత్వ భూములలో అక్రమంగా ప్లాట్ లు తయారు చేస్తూ ఒక్కో ప్లాట్ ను ఎనిమిది లక్షల నుండి పదమూడు లక్షల రూపాయలకు అమ్ముకుంటూ లక్షలు, కోట్లు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిన్నారం మండల రెవెన్యూ అధికారులకు మాత్రం చలనం రావటం లేదు. యాదేచ్చగా ప్రభుత్వ భూములు ఆక్రమించి, నకిలీ పట్టాలతో ఆక్రమణలకు పాల్పడుతున్నా తూతూ మంత్రంగా కూల్చివేతలు చేస్తూ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్. మండల పరిధిలో కొన్ని ఎకరాల్లో ప్రభుత్వ భూములు మాయమౌతున్నా ఏమీ తెలియనట్టు, తమకేమీ సంబంధం లేనట్టు, ఫిర్యాదులు చేస్తే తప్ప స్పందించని రెవెన్యూ అధికారులు ఉన్నా లేనికిందికే అంటున్నారు మండల ప్రజలు. ఖాజీ పల్లి లోని సర్వే నెంబర్ 181 భూములు అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా, గ్రేటర్ హైదరాబాద్ కు దగ్గరలో ఉండటంతో ఇక్కడి కొందరు దళారులకు అవకాశంగా మారింది. దీనికి తోడు ఎలాంటి చలనం లేని రెవెన్యూ అధికారులు.. అడ్డుకునేవారు లేక తమ సొంత భూములుగా భావిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే వున్న ఈ కాలనీలో అక్రమంగా వెలసిన నిర్మాణాలకు వత్తాసు పలుకుతూ ఇష్టానుసారంగా ఇంటి నెంబర్, నల్లా కనెక్షన్, కరెంటు కనెక్షన్లు ఇస్తూ పరోక్షంగా, ప్రత్యక్షంగా కబ్జాదారులకు సహకరిస్తున్నారు ఇక్కడి రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు, కార్యదర్శులు. వీరికి తోడు అవినీతి అంధకారంలో కూరుకుపోయిన అధికారుల సహకారం. ఇప్పటికే సుమారు వెయ్యి ప్లాట్ లు కబ్జా చేసిన కబ్జాకోరులు కోట్లల్లో దండుకున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి, అందులో ప్లాట్లు చేసి, అనధికారికంగా లక్షలు, కోట్లు దండుకుంటున్న సత్యనారాయణ, ముఠాపై కేసులు ల్యాండ్ గ్రాబ్బింగ్ కేసులు నమోదు చేసి, ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.