న‌వ్విపోదురుగాక‌..

0
473

మాకేటి సిగ్గ‌న్న‌ట్లే ఉంది తెలంగాణ అసెంబ్లీలో జ‌రుగుతున్న హంగామా. ఏపీలో పార్టీని త్యాగంచేసి, తెగించి తెలంగాన ఇచ్చినా పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేద‌న్న ఫ్ర‌స్టేష‌న్‌లో ఉంది కాంగ్రెస్‌పార్టీ. ఇవే చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాలు. ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది స‌మ‌యం కూడా లేదు. అసెంబ్లీలో అధికారపార్టీ నోరెత్త‌నివ్వ‌డంలేదు. ఇప్ప‌టికీ మ‌న్నుతిన్న పాముల్లా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ష్ట‌మ‌నే ఈమ‌ధ్య కాస్త దూకుడు పెంచింది. బ‌డ్జెట్ స‌మావేశాల్లో త‌డాఖా చూపిద్దామ‌ని పోడియం ద‌గ్గ‌ర హ‌డావుడి చేస్తే చివ‌రికి అస‌లుకే మోస‌మొచ్చేలా ఉంది.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకునేందుకు పోడియాన్ని చుట్టుముట్టారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఈ సీన్‌ని ముందే ఊహించిన ప్ర‌భుత్వం మార్ష‌ల్స్‌ని మోహ‌రించింది. త‌మ‌ని ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేయ‌టంతో కాంగ్రెస్ స‌భ్యుల‌కు చిర్రెత్తుకొచ్చింది. కాగితాలు చించి విసిరేశారు. కోమ‌టిరెడ్డి కోపంగా హెడ్‌ఫోన్‌ని విసిరికొట్టారు. అదికాస్తా శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్‌కి త‌గిలింది. సీన్ క‌ట్‌చేస్తే…స‌రోజినీ ఆస్ప‌త్రికి వెళ్లి కంటికో బ్యాండేజ్‌తో బ‌య‌టికొచ్చారు స్వామిగౌడ్‌. ఇంకేముందీ కాంగ్రెస్‌పార్టీ జుట్టు గులాబీపార్టీ చేతికి చిక్కింది.

ఒక‌ప్పుడు మ‌నం ఏం చేశాం..చ‌ట్ట‌స‌భ సాక్షిగా ఎలా వ్య‌వ‌హ‌రించామ‌నేది గ‌డిచిపోయిన గ‌తం. ఆ సెంటిమెంట్‌లు, ఆ ఎమోష‌న్లు వేరు. గ‌తంలోకి చూడ‌ట‌మే త‌ప్ప‌న్న‌ట్లు మాట్లాడుతున్న టీఆర్ఎస్ చ‌ట్ట‌స‌భ మ‌ర్యాద హుస్సేన్‌సాగ‌ర్‌లో క‌లిసింద‌ని అరిచి గీపెడుతోంది. ఈ మాత్రం ఛాన్స్ దొరికితే ఎందుకు వ‌దులుకుంటాన‌న్న‌ట్లు ఇద్ద‌రు ముగ్గురిపై వేటు వేసేందుకు సిద్ధ‌మైంది. త‌మ‌కు కంట్లో న‌లుసుల్లా ఉన్న‌వారిని ఎన్నిక‌ల్లోపు అసెంబ్లీవైపు రానిచ్చేలా క‌నిపించ‌డంలేదు.

ఇంటాబ‌య‌టా స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల్లో ఉన్న టీఆర్ఎస్‌…అసెంబ్లీలో విప‌క్ష‌పార్టీ విమ‌ర్శ‌ల్ని త‌ట్టుకోడానికి సిద్ధంగా లేదు. ఎన్ని రోజులైనా చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూనే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరెత్త‌కుండా చేయాల‌న్న వ్యూహంతో ఉంది. టీఆర్ఎస్ ప‌ని సులువు చేసేలా కాంగ్రెస్ తొంద‌ర‌ప‌డింది. కాస్త వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ఉంటే…ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల్ని అసెంబ్లీ సాక్షిగా దుమ్మెత్తిపోసేలా స‌న్న‌ద్ధ‌మై ఉంటే బావుండేది. కానీ మ‌రోసారి సెల్ఫ్‌గోల్ చేసుకుంది.