వింటానికే అసయ్యంగా ఉంది. చెప్పుకోవడానికే సిగ్గుచేటన్నట్లుంది నేతల తిట్లపురాణం. మామూలుగానైతే విజయసాయిరెడ్డి ఆ రేంజ్లో తిడతారని అనుకోలేదెవరూ. కానీ దొంగలా పీఎంవో చుట్టూ తిరుగుతున్నాడనీ..బీజేపీ-వైసీపీలకు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడని టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తుంటే అసలే కుతకుతలాడిపోతున్నాడు పొలిటికల్ ఆడిటర్. రాజ్యసభలో ప్రధాని మోడీ కాళ్లు మొక్కాడని టీడీపీ నేతలు మరో ఆరోపణతో పరువు తీసేసరికి ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యేలనుంచి ఎంపీలదాకా ఎవరినీ వదల్లేదు. చివరికి చంద్రబాబుని కూడా దుమ్ము దులిపేసి చార్లెస్ శోభరాజ్‌తో పోల్చేశాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
‘‘తెదేపాలోని చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలంతా నేరగాళ్లు. వారికి నాయకుడు.. గజనేరగాడు చంద్రబాబు. గజదొంగ చార్లెస్ శోభ్‌రాజ్‌కు సమానమైన వ్యక్తి చంద్రబాబు’’
పేర్లెత్తి మరీ తిట్టిపోసేసరికి ఆయనతో మాటలు అనిపించుకున్న నాయకులతో పాటు టీడీపీ లీడర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏ2కి తమను తిట్టే నైతిక హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మల్ని తగలబెట్టి తమ అక్కసు బయటపెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇక చంద్రబాబు అయితే అసెంబ్లీలో విజయసాయిరెడ్డి తిట్టిన తిట్లని ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ప్రజలకోసం ఎవరేమన్నా భరిస్తామని భారీ డైలాగ్ వదిలారు.
‘
‘తల్లిదండ్రులు ఎవరికైనా దైవంతో సమానం. అలాంటిది నా తల్లిదండ్రులను నిందించడం దారుణం. తల్లిదండ్రులను నిందించడం భారతీయ సంప్రదాయమా’’
మోడీ కాళ్లు పట్టుకున్నానని టీడీపీ చేసిన ఆరోపణలతో రాజ్యసభ సీసీ ఫుటేజీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి. నమస్కారం సంస్కారమంటున్న వైసీపీ ఎంపీ తాను కాళ్లు పట్టుకోలేదంటున్నారు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే ప్రశ్నేలేదంటూ టీడీపీపై ఆరోపణలు కొనసాగిస్తున్నారు.
‘‘చదువుకున్న వ్యక్తి అయిన సాయిరెడ్డికి ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేదా? ఇలాంటి వారు రాజ్యసభలో అడుగుపెట్టడం మనం చేసుకున్న ఖర్మ. తెలుగు ప్రజలు అంతా చూస్తున్నారు. వారే తగిన బుద్ధిచెప్తారు’’
‘‘ఆయన పదజాలం చూస్తుంటే అడవి మనిషా అనే అనుమానం వస్తోంది’’- ఎంపీ మురళీమోహన్
మరోవైపు బీజేపీ నేతలు కూడా ఓ ఎంపీ ప్రధాని ఆశీస్సులు (చేతులు జోడించడంనుంచి పాదాభివందనం దాకా ఏదయినా) తీసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తూ విజయసాయిని వెనకేసుకొస్తున్నారు. మొత్తానికి..ఓ రోజా, ఓ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పూనినట్లు విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు చివరికి వైసీపీలోనూ చర్చనీయాంశమే.