ప్రత్యేకహోదా, విభజనహామీలపై మొదలైన నిరసన చివరికి అవిశ్వాసం దాకా వస్తుందనీ, దాన్నుంచి బయటపడేందుకు తాము ఇన్నేసి పిల్లిమొగ్గలు వేయాల్సి ఉంటుందనీ ఊహించలేదు బీజేపీ పెద్దలు. వైసీపీ ఏదో వ్యూహంతో అవిశ్వాస ప్రతిపాదన తీసుకొస్తే ఎక్కడ విపక్షపార్టీ మార్కులు కొట్టేస్తుందోనని టీడీపీ స్ట్రాటజీ మార్చేసింది. ఎవరో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం మా ఇంటావంటా లేదన్నట్లు తానే అవిశ్వాస నోటీసు ఇచ్చింది. కానీ కొన్ని రాజకీయ పక్షాల నిరసనలతో సభ ఆర్డర్‌లో లేదనే సాకుతో వాయిదాలమీద వాయిదాలు పడుతూ వచ్చింది. ప్రాంతీయపార్టీల నోటీసుల్ని ఎన్డీఏ సర్కారు తేలిగ్గా తీసుకోవటంతో కాంగ్రెస్, సీపీఎం సహా మరికొన్ని పక్షాలు అవిశ్వాస నోటీసులివ్వటంతో చచ్చినట్లు చర్చ ప్రారంభించడం తప్ప బీజేపీ పెద్దలకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.
మొన్నటిదాకా పార్లమెంట్‌లో ఓ పక్క టీఆర్ఎస్..మరో పక్క అన్నాడీఎంకే ఎంపీలు రచ్చరచ్చచేశారు. బీజేపీ కోరుకున్నదీ అదే. రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్, కావేరీ బోర్డుకోసం అన్నాడీఎంకే రోజుల తరబడి వెల్‌లో నిరసనలకు దిగి సభ వాయిదాకి పరోక్షంగా సహకరించాయి. ఎన్డీఏ సర్కారుకు కావాల్సిన బిల్లులేవీ ఆగలేదు. సందట్లో సడేమియాలా ఆ రగడలోనూ కొన్ని బిల్లుల్ని ఆమోదింపజేసుకుంది కేంద్రప్రభుత్వం. కానీ అవిశ్వాస నోటీసులకు మాత్రం సభ ఆర్డర్‌లో లేదనే సాకు దొరికింది. అన్నాడీఎంకే అంటే అమ్మ మరణం తర్వాత ఎటూ తేల్చుకోలేని గందరగోళంలో పడింది. టీఆర్ఎస్ ఎందుకిలా చేస్తోందన్న డౌటొచ్చేసింది అందరికీ. కాస్త ఆలస్యంగానైనా తమ పాతివ్రత్యంపై జాతీయస్థాయిలో శల్యపరీక్ష జరుగుతోందన్న విషయం గులాబీ పార్టీకి తెలిసొచ్చింది. అందుకే సభలో రగడ సృష్టించాలన్న నిర్ణయాన్ని విరమించుకుంది.
సింగిల్‌గా మిగిలినా తన ఎజెండా తనేదనని చెప్పుకుంటూ అన్నాడీఎంకే మాత్రం సభలో అలజడి కొనసాగించింది. ఒక్క సభ్యుడు లేచి అరిచినా అదిగో అడ్డుపడుతున్నాడంటూ సభను వాయిదావేసి వెళ్లిపోయేలా ఉంది ఎన్డీఏ సర్కారు తీరు. అన్నాడీఎంకే ఇలాగే నాలుగురోజులు రచ్చ చేస్తే సభను నిరవధికంగా వాయిదావేసి మొహం చాటేయొచ్చని ప్లాన్. కానీ అన్నాడీఎంకేకి కూడా తత్వం బోధపడిందేమో..అవిశ్వాసానికి మేం కూడా రెడీ అని ప్రకటించి బీజేపీని సంకటంలో పడేసింది. కావేరీ యాజమాన్య బోర్డుపై కేంద్రం తేల్చకపోతే అవిశ్వాసం పెట్టడమో లేకుంటే ఇతరులు పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వడమో చేస్తామని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై తేల్చిచెప్పేశారు. అన్నట్లు ఆయన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ కూడా. చచ్చింది గొర్రె..!