అసలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసు. గులాబీజెండా ఎగరేసిన నాటినుంచీ అలవాటైన బై ఎలక్షన్స్ వ్యూహాన్ని సార్వత్రిక ఎన్నికల ముందు మరోసారి అమలుచేద్దామనే కదన కుతూహలంతో ఉంటే..కోర్టు ఆదేశంతో కేసీఆర్ అహం దెబ్బతింది. అసెంబ్లీ సాక్షిగా అంతా వ్యూహాత్మకంగా చేసుకొస్తుంటే..హైకోర్టు నిర్ణయం సానుకూలంగా లేకపోయేసరికి గులాబీబాస్‌కి చిర్రెత్తుకొచ్చింది. ఓసారి కోర్టులో మెలిక పడిందంటే అదిప్పట్లో తెగదు. తమ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ కాకపోతే చేసిన ప్రయత్నమంతా మూసీలో పోసిన స్కాచే. అందుకేనేమో ఈ నాటకీయ పరిణామాలన్నీ.

తెలంగాణ అడ్వకేట్ జనరల్ డి.ప్రకాశ్‌రెడ్డి హఠాత్తుగా పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా తన రాజీనామా లేఖని గవర్నర్‌కి పంపించేశారు. ఇంత సడెన్‌గా కీలక పదవినుంచి ఆయన తప్పుకోవడానికి కారణం కోమటిరెడ్డి కేసేనన్నది కన్‌ఫం. నల్గొండ, అలంపూర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలపై అసెంబ్లీ వేటేసింది. వారిద్దరూ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టబోతుండగా ఏజీ రాజీనామా కలకలం రేపుతోంది.
శాసనసభ సంఘటనలపై వీడియో ఫుటేజీ సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోమటిరెడ్డి కోర్టుని అభ్యర్థించారు. ఈనెల 22న వీడియో ఫుటేజీ సమర్పించడానికి ఏజీ తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు మరికొంత గడువు కోరారు. మంగళవారం కేసు విచారణకు రానుండగా వీడియో ఫుటేజీ సమర్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పినట్లు సమాచారం. దీనికితోడు ఆరు వారాలపాటు ఉప ఎన్నికలు నిర్వహించవద్దంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వు కూడా టీఆర్ఎస్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. తమను సంప్రదించకుండా ఫుటేజీపై కోర్టుకు హామీ ఇవ్వడంతో పాటు ఏజీ సరిగా వాదించలేదన్న అసంతృప్తితో ఉంది కేసీఆర్ సర్కారు.
న్యాయపరమైన ఇబ్బందుల్ని ఏజీ ప్రకాశ్‌రెడ్డి చెప్పినా టీఆర్ఎస్ ప్రభుత్వం అసంతృప్తితో ఉండటంతో ఆయన పదవినుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల తరఫున వాదనలు వినిపించడానికి సుప్రీంకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కేసు వాదనకు వెళ్లొద్దనీ..హరీష్‌సాల్వే చూసుకుంటారని ప్రభుత్వం నుంచి సమాచారం రావడంతో ప్రకాశ్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. గత ఏడాది జులై 17నే ఆయన ఏజీగా బాధ్యతలు స్వీకరించారు.