బ్యాంకుల్ని దోచుకునేవాళ్లకి మేమున్నామని భరోసా ఇస్తున్నట్లే ఉంది మోడీ సర్కారు వ్యవహారం చూస్తుంటే. వేలకోట్లు దోచుకుని విదేశాలకు వెళ్లిపోయేదాకా చోద్యంచూసింది కేంద్రప్రభుత్వం. ఆర్థిక నేరగాళ్ల పనిపట్టాలనే పట్టుదల కేంద్ర పాలకుల్లో ఏ కోశానా కనిపించడంలేదు. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీని వెనక్కి తెస్తామనీ…తిన్నదంతా కక్కిస్తామనీ ప్రకటనలే తప్ప ఆచరణన దిశగా ఒక్క అడుగూ పడలేదు. సీబీఐ, ఈడీ అధికారులు కోడిగుడ్డుపై ఈకలు పీకే పన్లో ఉంటే…అమెరికాలో తన ఆస్తుల్ని ఫర్ సేల్ పెట్టేశాడు నీరవ్ మోడీ.
నీరవ్‌మోడీ చెప్పిందానికి, చేస్తున్నదానికీ పొంతనేలేదు. ఎక్కడికీ పారిపోను.. బ్యాంకులకు బకాయిపడ్డ అప్పులన్నీ కడతానని గతంలో చెప్పిన నీరవ్ మోడీ ఆస్తులు అమ్మి సొమ్ము చేసుకుని విదేశాల్లోనే సెటిలైపోవాలనుకుంటున్నాడు. ఫైర్ స్టార్ డైమండ్ పేరుతో నీరవ్ మోడీకి అమెరికాలో చాలాఆ బ్రాంచ్‌లున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ విషయంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, గీతాంజలి డైమండ్స్‌పై ఈడీ, సీబీఐ కేసులు పెట్టాయి. నీరవ్ మోడీ ఆస్తుల్ని జప్తు చేసి ఆ ఘరానా కేటుగాడికోసంస లుక్ అవుట్ నోటీసులిచ్చాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 14న నీరవ్ మోడీతో పాటు పీఎన్‌బీ స్కామ్ నిందితులంతా విదేశాలకు పారిపోయారు. వాళ్లు విదేశాలకు వెళ్లిన వారానికిగానీ పీఎన్‌బీ స్కామ్ బయటికి రాలేదు. అక్రమార్కులకు మోడీ సర్కారు అండగా నిలిచిందనే ఆరోపణలు గుప్పుమనటంతో వాళ్ల మెడలు పట్టి లాక్కొస్తామని ప్రభుత్వం చెబుతున్నా…ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు కనిపించడంలేదు. 6వేలకోట్ల విలువైన నీరవ్‌మోడీ ఆస్తుల్ని జప్తుచేశారు. ఇంకా 8వేలకోట్లు వసూలుచేయాల్సి ఉంది. తన ఆస్తుల సీజ్‌పై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాడు నీరవ్. తన సంస్థలు దివాలా తీసినట్లు అమెరికాలో పిటిషన్ వేశాడు. అందులో తాను పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ గురించి మాట మాత్రమైనా ప్రస్తావించలేదు.
నీరవ్ మోడీ ఆస్తులు అమ్మితే తాము తీవ్రంగా నష్టపోతామంటోంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. నీరవ్ ఆస్తుల బిడ్డింగ్ వ్యవహారం నిజాయితీగా జరిగేలా చూడాలని యూఎస్ కోర్టుల్ని ఆశ్రయించింది. అయితే నీరవ్ వ్యవహారం చూస్తుంటే పీఎన్‌బీ ఆశలు దింపుడుకళ్లెమే. నీరవ్ అమెరికాలో తన ఆస్తులన్నీ అమ్మేసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ దివాళా తీయాల్సి వస్తుంది. దావూద్‌ని కరాచీనుంచి ఎత్తుకొచ్చేస్తామన్న ఉత్తరకుమారులు ముందు బ్యాంకులకు కన్నమేసిన ఘరానా మోసగాళ్లనుంచి తీసుకున్న అప్పులు కక్కిస్తే అంతా సంతోషిస్తారు.