చేసిందంతా చేసి ఏడుపొక‌టి!

0
409

ఒక్క ట్యాంప‌రింగ్ అత‌ని జీవితాన్ని మార్చేసింది. ఆసీస్ కెప్టెన్‌గా మొన్న‌టిదాకా ఓ వెలుగు వెలిగిన ఆ క్రికెట‌ర్‌ని ఇప్పుడంతా దొంగ‌లా చూస్తున్నారు. మొహాన ఊస్తున్నారు. బాల్ ట్యాంపరింగ్ తర్వాత స్టీవెన్ స్మిత్‌కి త‌లెక్క‌డ పెట్టుకోవాలో తెలీడంలేదు. బ్యాన్‌తోత టీంనుంచి ఊస్టింగ్ అయి జోహ్నెస్ బర్గ్ నుంచి ఆస్ట్రేలియాకు దొంగ‌లా వెళ్లాల్సి వ‌చ్చింది స్మిత్‌. ఎవ‌ర‌న్నా కుమ్మేస్తారేమోన్న డౌట్‌తో స్మిత్‌ను పోలీసులు హడావుడిగా లాక్కెళ్లి ఫ్లైట్ ఎక్కించారు. చీటర్ చీటర్ అని ప‌బ్లిక్ స్లోగ‌న్స్ ఇస్తుంటే సిగ్గుతో చితికిపోయాడు స్మిత్‌.

ఆట‌లో గెల‌వాలంటే స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డాలి. అన్ని విభాగాల్లో రాణించి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుని ముప్పుతిప్ప‌లు పెట్టాలి. కానీ స్మిత్ తొండి ఆట ఆడి గెల‌వాల‌నుకున్నాడు. ఎవ‌ర‌న్నా చేయాల‌నుకున్నా త‌ప్ప‌ని వారించాల్సిన వాడే బాల్ ట్యాంప‌రింగ్‌ని ప్రోత్స‌హించాడు. తీరా త‌మ నిర్వాకం బ‌య‌ట‌ప‌డి అంత‌ర్జాతీయంగా భ్ర‌ష్టుప‌ట్టేస‌రికి ఏడుపొక్క‌టే త‌క్కువ‌. త‌క్కువేంటీ…ఏడ్చేశాడు. బాల్ ట్యాంప‌రింగ్ వివాదంలో లైఫ్ టైమ్ బ్యాన్ విధిస్తార‌నుకుంటే ఏడాదితో స‌రిపెట్టారు. అయినా ఈ అవ‌మానాన్ని తాళ‌లేక కన్నీళ్లు పెట్టుకుంటూ సారీ చెబుతున్నాడు.

తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశానని స్టీవెన్ స్మిత్ ఒప్పుకున్నాడు. చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నానన్నాడు.. టాంపరింగ్‌ని అనుమతించకుండా ఉండాల్సిందని ఇప్పుడు తీరిగ్గా బాధ‌ప‌డుతున్నాడు. త‌న‌ తప్పు ఇతరులకు కనువిప్పు అవుతుంద‌ని వేదాంతం వ‌ల్లిస్తున్నాడు. భవిష్యత్‌లో అయినా అంతా త‌న‌ను క్ష‌మించేస్తార‌ని సింప‌థీ మూట‌గ‌ట్టుకోవాల‌నుకుంటున్నాడు. క్రికెట్ అంటే ఇష్టం, క్రికెట్ అంటే ప్రాణం. అంతే తప్ప ఆటకు చెడు చేయాలనీ, ఆస్ట్రేలియాకు చెడ్డపేరు తీసుకురావాలన్న ఉద్దేశం తనకెంత మాత్రం లేద‌ని ముక్కు చీదుతున్నాడు ఆసీస్ తాజా మాజీ కెప్టెన్‌.

ఓ ప‌క్క స్మిత్ సారీల‌మీద సారీలు చెబుతుంటే..బాల్ షేప్‌ని మార్చేసి ట్యాంప‌రింగ్‌లో మెయిర్ రోల్ ప్లే చేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాత్రం త్వరలోనే కొత్త విషయాలు బైటపెడతానని అంటున్నాడు. ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌కు సారీ చెప్పినా..త్వరలోనే సెకండ్ యాంగిల్ చూపిస్తానంటున్నాడు వార్న‌ర్‌. చెప్పాల్సింది చాలా ఉంది..చూస్తూనే ఉండండ‌ని ఊరిస్తున్నాడు. టీమంతా కలిసి తప్పు చేసినా…తానొక్కడినే టార్గెట్ అయ్యాయ‌నుకుంటున్నాడా? లేదంటే ఈ త‌ప్పులో ఇంకెవ‌రి భాగ‌స్వామ్యం ఉందో చెప్పాల‌నుకుంటున్నాడా? ఏం చేస్తాడో ఏంటో?