చేసిందంతా చేసి ఇదో డ్రామానా!

0
598

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఇంత అధ్వానంగా, ఇంత దారుణంగా ఎప్పుడూ జ‌రిగిందే లేదు. కొన్నాళ్లు టీడీపీ, టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే ఎంపీల నిర‌స‌న‌లు. అవిశ్వాస నోటీసులిచ్చాక టీడీపీ కుర్చీల్లో కూర్చుంటే కొన్నాళ్లపాటు వెల్‌లో టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే స‌భ్యుల డ్రామాలు. ఓ ప‌క్క పార్టీ అధినేత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం తిరుగుతుంటే..పార్ల‌మెంట్‌లో బీజేపీకి అనుకూలంగా ఉన్నామ‌నే చెడ్డ‌పేరు మ‌న‌కెందుక‌ని టీఆర్ఎస్ వెన‌క్కి త‌గ్గినా అన్నాడీఎంకే మాత్రం ఓసారి క‌మిటైతే త‌న మాట తానే విన‌నంటోంది. అవిశ్వాస నోటీసులిచ్చాక ప‌న్నెండు రోజులూ స‌భ వాయిదా ప‌డింది. మొత్తంమీద 21 రోజులు స‌భ‌లో ఎలాంటి చ‌ర్చా లేదు ఒక్క ర‌చ్చ త‌ప్ప‌.

మొహ‌మాటానికి వెళ్లి మీ స్థానాల్లో కూర్చోమ‌ని చెప్ప‌టం త‌ప్ప స‌భ‌ను ఆర్డ‌ర్‌లో పెట్టేందుకు స్పీక‌ర్ మ‌న‌స్ఫూర్తిగా ఏ రోజూ ప్ర‌య‌త్నించ‌లేద‌న్న విష‌యం స‌భాప‌ర్వాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన ప్ర‌తీ ఒక్క‌రికీ అర్ధ‌మ‌య్యింది. అధికారంలో ఉన్న ఎన్డీఏ స‌ర్కారు స‌భ స‌జావుగా సాగాల‌ని కోరుకోలేదు. అవిశ్వాస తీర్మానాలు స‌హా అన్ని విష‌యాల‌పై చ‌ర్చించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని మేక‌పోతు గాంభీర్యం ప్ర‌క‌టించ‌డ‌మే గానీ…స‌భ‌ను స‌జావుగా న‌డ‌పాల్సిన బాధ్య‌త త‌మ‌ద‌నే విష‌యాన్ని బీజేపీ మ‌ర్చిపోయింది. క‌థ క్లైమాక్స్‌కి వ‌చ్చాక‌, అవిశ్వాస తీర్మానంనుంచి త‌ప్పించుకుని పారిపోతూ దారుణం జ‌రిగిపోయింద‌ని గుండెలు బాదుకుంటోంది ఎన్డీఏ ప్ర‌భుత్వం.

ఎలాంటి చర్చా లేకుండా స‌మావేశాలు వాయిదా పడటంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మ‌స్తుతి, ప‌ర‌నింద‌లా బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కార‌ణం కాంగ్రెస్సేన‌ని మండిప‌డ్డారు. ‘అవిశ్వాస తీర్మానం, కావేరీ సమస్య సహా ఇతర సమస్యలపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని సమస్యలపైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నా.. పార్లమెంటు కార్యకలాపాలను ఎందుకు అడ్డుకుంటున్నట్టు? ముందుగా కాంగ్రెస్ దీనికి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

పార్లమెంటు కార్యకలాపాలు జరగలేదు కాబ‌ట్టి 23 రోజుల జీతాన్ని బీజేపీ సహా ఎన్డీయే ఎంపీలెవరూ తీసుకోరంటూ ముందురోజే అనంత కుమార్ ప్రకటిస్తే…రోజూ పార్ల‌మెంట్‌కు వ‌చ్చాన‌నీ..జీతం తీసుకోకుండా ఎందుకుంటాన‌ని అదే పార్టీకి చెందిన సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వ్యాఖ్యానించారు. నోటితో మాట్లాడుతూ నొస‌టితో వెక్కిరించ‌డం..క‌డుపులో ఒక‌టుంచుకుని బ‌య‌టికి మ‌రోటి క‌క్కేయ‌డం బీజేపీకి తెలిసిన విద్యేగా..రంకు నేర్చిన‌మ్మ‌కు బొంక‌డమెలాగో ఒక‌రు చెప్పాలా?