క‌న్న‌డ‌నాట గాలి రాజ‌కీయం

0
721

ఒక‌ప్పుడు క‌ర్ణాట‌క‌లో బీజేపీకి అత‌నే రిజ‌ర్వ్‌బ్యాంక్‌. అడ్డ‌గోలుగా త‌వ్వేసుకున్న ఖ‌నిజంతో వెన‌కేసిన వేల‌కోట్ల‌తో క‌మలం పార్టీ అత‌న్ని అపురూపంగా చూసుకుంది. త‌ను, త‌న సోద‌రుడు, అనుచ‌ర‌గ‌ణం అంతా ఒక‌ప్పుడు క‌ర్నాట‌క బీజేపీ ప్ర‌భుత్వం త‌మ క‌నుస‌న్న‌ల్లో న‌డిచేలా చూసుకున్నారు. ప‌చ్చ‌నోట్ల రాజ‌కీయాన్ని న‌డిపించారు. సీన్ క‌ట్ చేస్తే..ఇప్పుడ‌దే మైనింగ్ మాఫియా కింగ్ బీజేపీకి చేద‌య్యాడు. ఆ బుర‌ద మ‌ళ్లీ అంటించుకుంటే క‌డుక్కోలేక చావాల్సి వ‌స్తుంద‌ని అత‌నితో మాకేం సంబంధం లేదంటూ పాత అనుబంధాన్ని తెంచేసుకుంది(అంతా న‌మ్మేలా అలా చెబుతోంది మ‌రి). కానీ రాజ‌కీయానికి అల‌వాటుప‌డ్డ ప్రాణం అంత ఈజీగా స‌ర్దుకుపోతుందా? పైస‌లు ప‌ల్లీబ‌ఠానీల్లా పంచగిలిగిన‌ప్పుడు పార్టీల‌తో ప‌నేముంది? ఆ న‌మ్మ‌కంతోనే త‌డాఖా చూపిస్తానంటున్నాడు క‌న్న‌డ కింగ్‌మేక‌ర్ గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నుంచి కాషాయ‌పార్టీ అభ్య‌ర్థిగా పోటీచేయాల‌ని చాలా లెక్క‌లేసుకున్నాడు గాలి జనార్దన్‌ రెడ్డి. అయితే గాలితో త‌మ పార్టీకి సంబంధం లేద‌ని బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షా తేల్చేయ‌టంతో ప్లాన్ టూకి ప్రిపేర‌య్యాడు గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి. బళ్లారి సిటీ నుంచి తమ్ముడు సోమశేఖర్‌ రెడ్డిని ఇండిపెండెంట్‌గా పోటీకి దించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.గాలి జనార్దన్ రెడ్డి, సోమశేఖర్‌రెడ్డిల‌కు బళ్లారి రెడ్డి బ్రదర్స్ అనే పేరుంది. మైనింగ్ స్కామ్‌లో గాలి జనార్దన్ రెడ్డి 42 నెలల పాటు క‌ట‌క‌టాల వెనుకున్నాడు. దీంతో గాలి విష‌యంలో బీజేపీ మౌనం పాటిస్తూ…చివ‌రికి అత‌నికి దూరంగా ఉండాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది.

బీజేపీ త‌మ‌ను దూరం చేసుకోద‌నే న‌మ్మ‌కంతోనే మొన్నటిదాకా ఉన్నారు బ‌ళ్లారి బ్ర‌ద‌ర్స్‌. అదే ధైర్యంతో, పార్టీ త‌మ‌ని కాద‌ని వెళ్ల‌ద‌నే న‌మ్మ‌కంతో తాము బీజేపీతోనే ఉన్నామని ప్ర‌క‌టించాడు గాలి బ్ర‌ద‌ర్ సోమశేఖర్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి నుంచి బీజేపీ టిక్కెట్‌పైనే పోటీ చేస్తారని చెప్పుకొచ్చాడు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్‌షాకి గాలి జనార్దన్ రెడ్డి విష‌యంలో త‌మ పార్టీ స్టాండ్ ఏంటో వెల్ల‌డించ‌క త‌ప్ప‌లేదు. ఓ ప‌క్క సిద్ధ‌రామ‌య్య‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ..గాలిని చంక‌నేసుకుని తిరిగితే అడ్డంగా బుక్క‌వుతామ‌నే భ‌యంతోనే…అత‌నితో ఎలాంటి సంబంధం లేద‌ని అనివార్యంగా చెప్పాల్సి వ‌చ్చింది.

బీజేపీ సంబంధం లేద‌నేస‌రికి తామేంటో, త‌మ త‌డాఖా ఏంటో చూపించాల‌నుకుంటున్నారు గాలి బ్ర‌ద‌ర్స్‌. బళ్లారి సిటీ నుంచి సోమశేఖర్ రెడ్డిని ఇండిపెండెంట్‌గా నిలబెట్టి భారీ మెజారిటీతో గెలిపించాలని గాలి జనార్దన్ రెడ్డి కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ట‌. బీజేపీ అధికారంలోకి రావాలేగానీ దానికి ద‌గ్గ‌ర‌కావ‌డం ఎంత తేలికో…గాలికి తెలియ‌నిదా? అమ్మ పుట్టిల్లు మేన‌మామ‌కెరుకే.