శ్రీరెడ్డి. న్యూస్ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్‌లో కొన్నాళ్లు కనిపించి…మొహానికి రంగేసుకుని సిన్మా ఇండస్ట్రీలో సెలబ్రిటీని అయిపోదామని పగటి కలలెన్నో కన్న అనేకానేకమందిలో తనూ ఒకటి. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నిన్నగాక మొన్నొచ్చిన నార్త్ హీరోయిన్‌కి కూడా రెండ్రోజులకే తెలిసిపోతుంది. ఇక తెరవెనుక చీకటికోణాల గురించీ, కొందరు గోకుడురాయుళ్ల గురించీ శ్రీరెడ్డి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎవరు బతుకు బస్టాండ్ అవుతుందోనని ఆరాటం కొద్దీ ఆ పేర్లేవో విందామనే తుత్తి తప్ప కొత్త మ్యాటరేం లేదు. ఉండబోదు.
హీరోయిన్ కావాలనుకున్న అమ్మాయి ఏవో చిన్నాచితకా పాత్రలతోనో, వ్యాంప్ క్యారెక్టర్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తే ఫ్రస్టేషన్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు శ్రీరెడ్డి అరచిగోల పెడుతున్న వ్యవహారం కూడా అందులో భాగంగానే భావిస్తోంది రంగుల ప్రపంచం. ఇలాంటి ఆరోపణలు చేసినవాళ్లలో శ్రీరెడ్డి మొదటిదీ కాదు…ఆమెతోనే ఇది ఆగేదీ కాదు. అవకాశాలు కావాలంటే అందుకు ఒప్పుకోవాల్సిందేనని గతంలో కొందరు నటీమణులు పచ్చినిజాల్ని పబ్లిక్‌గా చెప్పేశారు. కాస్టింగ్ కౌచ్…వినేందుకు కాస్త మోడ్రన్‌గా ఉందనేగానీ మోటుగా చెప్పాలంటే నీకు ఛాన్సిస్తే మరి నాకేంటనే బేరమే.
మగాళ్లను లుంగీల్లో చూడటం ఇష్టమని ఎందుకన్నావ్? అంటూ ఓ మీడియా డిస్కషన్లో శ్రీరెడ్డిని సూటిగా ప్రశ్నించింది నటి జ్యోతి. గోదావరి వాళ్లు లుంగీలేసుకుంటారు.. అదే చెప్పానన్న శ్రీరెడ్డి..తన దగ్గర 12 మంది పేర్లున్నాయని..జ్యోతి వరస చూస్తుంటే వారెవరో తన నోటితో చెప్పించేలా ఉందని వ్యాఖ్యానించింది. ఆ పేర్లని టాలీవుడ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లొచ్చుగా..మీడియాకెక్కి ఇండస్ట్రీ పరువు ఎందుకు తీస్తున్నావని జ్యోతి గట్టిగానే నిలదీసింది. మరో వర్ధమాన నటి అయితే చెప్పు తీసుకుని కొడతానంటూ శ్రీరెడ్డి తీరుపై పబ్లిక్ డిబేట్లోనే ఆగ్రహించింది.
సినిమా అవకాశాలు దక్కాలంటే పడకగది సుఖం అందించాల్సిందేనని సిన్మా ఇండస్ట్రీ గురించి తెలిసిన నిజాన్నే కాస్త ఫ్రెష్ అప్డేట్లా చెబుతోంది శ్రీరెడ్డి. తనతో పాటు అనేక మంది హీరోయిన్లు (ఇండస్ట్రీ ఇంకా గుర్తించలేదు) బాధితులేనని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సినీ అవకాశాలు దక్కాలంటే పక్కకింద నలగాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నచ్చితే చేసుకోవడం, నచ్చకపోతే ఓ నమస్కారం పెట్టి తప్పుకోవడం. ఏ రంగంలోనైనా అదే ఫైనల్ ఆప్షన్. అయితే ఏం జరిగినా మౌనంగా భరించాలా అంటే..పోరాడొచ్చు. కానీ సినీ పరిశ్రమలో అది ఫలితం లేని ప్రయత్నమే. కొందరి వ్యవహారాలపై రచ్చ చేయాలంటే పరిశ్రమే బోనులో నిలుచోవాల్సి వస్తుంది. సుచీలీక్స్‌తో సంచలనం తప్ప ఒరిగిందేమీ లేదన్న విషయం మరిచిపోలేం.
‘కాస్టింగ్ కౌచ్’పై సినీ పరిశ్రమలో ఓ రేంజ్లో చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలోని కొందరు ఛాన్సుల పేరుతో హీరోయిన్లని శారీరకంగా లొంగదీసుకుంటున్నారని కొందరు ఓపెన్‌గా చెబుతున్నారు. రాధికా ఆప్టే, ఇలియానా సహా కొందరు బయటపెట్టిన విషయాలు నాలుగురోజులు దుమారం రేపి తర్వాత ఇవన్నీ మామూలేనన్నట్లు తెరమరుగైపోయాయి. సుచీలీక్స్‌తో తనకు మెంటల్ అని ముద్రేసేశారు. ఇప్పుడు శ్రీరెడ్డి లీకులతో తన పరువు పోవడం తప్ప జరిగేదేమన్నా ఉందా?
ఇండస్ట్రీలోని ప్రముఖుల వ్యవహారాల్ని బయటపెడతానని బెదిరిస్తోంది హీరోయిన్గా ఎదగలేకపోయిన శ్రీరెడ్డి. ముందు 90శాతం మంది నీచ్కమీనేలని చెప్పిన శ్రీరెడ్డి ఇప్పుడా కామెంట్‌ని వెనక్కి తీసుకుంది. ఇండస్ట్రీపై ఆవేదన కంటే కొందరిని తన దారిలోకి తెచ్చుకోవడమే శ్రీరెడ్డి టార్గెట్‌గా కనిపిస్తోందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. తన దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయంటూ శ్రీరెడ్డి కొన్ని శాంపిల్స్‌ని ఇద్దరు పీఆర్వోలకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఓ డైరెక్టర్ ఆమెతో ఏకాంతంగా ఉన్న దృశ్యాలున్నాయని చెప్పుకుంటున్నారు. అంటే చాలా ప్లాన్డ్గా కెమెరాలు సెట్‌చేసి కొందరిని ముగ్గులోకి దించిందనేగా? ముగ్గురు హీరోలు కూడా తనదగ్గరున్న వీడియోల్లో ఉన్నారంటోంది శ్రీరెడ్డి. తను చెప్పినట్లు వినకపోతే…తనదారికి రాకపోతే బతుకు బస్టాండ్ చేస్తాననేగా?
ఓ దర్శకుడు. ముగ్గురు హీరోలు. వాళ్ల బతుకు ఆధారాలతో బయటపెడతానంటోంది శ్రీరెడ్డి. వారు స్టార్ హీరోలు కాదు. అలాగని మరీ చిన్నవాళ్లేం కాదు. మధ్యస్తమన్నమాట. వీరు తరచూ పార్టీలకు వచ్చిపోతుంటారు. వీళ్ల సిన్మాల్లో ఎక్కువగా కొత్త హీరోయిన్లే కనిపిస్తుంటారనేది…కనుక్కోండి చూద్దాం అన్నట్లు శ్రీరెడ్డి ఇస్తున్న హింట్స్. కోట్లు చేతులు మారాకే సుచీలీక్స్ ఆగిపోయాయనే ప్రచారం ఉంది. మరి ఇండస్ట్రీని పినాయిలేసి కడగాలన్నట్లు మాట్లాడుతున్న శ్రీరెడ్డి నిజంగానే బయటపెడుతుందా? కాంప్రమైజ్ అయిపోతుందా?
శ్రీరెడ్డిలాంటి తెలుగమ్మాయికి పోటీలు పడి అవకాశాలిచ్చేంత విశాలహృదయం సినీపరిశ్రమకు లేదు. టాలీవుడ్ అనే కాదు ఏ ఉడ్లోనైనా దిగుమతి సరుకుకే డిమాండ్ ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త మొహాలు ఎక్కడ దొరుకుతాయా అని ఉత్తరాది అమ్మాయిలకోసం అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. ఇక పరభాషా హీరోయిన్లనైతే నెత్తిన పెట్టుకుంటారు. కొత్తొక వింత..పాతొక రోత. ఇండస్ట్రీలో ఎవరి డిమాండ్ ఎన్నాళ్లో ఎవరూ చెప్పలేరు. తనుకున్న కటౌట్‌కి ఇండస్ట్రీలో ఏం ఎక్స్పెక్ట్ చేసిందో, ఎందుకు హర్ట్ అయ్యిందో శ్రీరెడ్డికే తెలియాలంటున్నారు సినీజనం. రచ్చరంబోలా చేస్తున్న శ్రీరెడ్డికి పిలిచి రెండు సిన్మాల్లో ఛాన్స్ ఇస్తున్నాడు తేజ. దీంతో శ్రీరెడ్డి జాతకం మారిపోతుందని చెప్పలేం. ఎందుకంటే కడుపులో దాచుకుని కోఆపరేట్ చేసేవాళ్లకే ఇండస్ట్రీలో నాలుగు అవకాశాలుంటాయనేది ఓపెన్ సీక్రెట్.